Asianet News TeluguAsianet News Telugu

TSRTC: ముదిరిన బిగ్ బాస్ పైత్యం.. ఆర్టీసీపై అభిమానుల దాడి.. సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్

బిగ్ బాస్ సీజన్ 7 ఫలితాల తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ పరిసర ప్రాంతాల్లో అల్లరి రేగింది. విన్నర్ ప్రశాంత్, రన్నర్ అప్ అమర్‌దీప్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. వారు అటుగా వచ్చిన ఆరు ఆర్టీసీ బస్సులపై దాడి చేశారు. అద్దాలు పగులగొట్టారు.
 

biggboss fans attacks 6 tsrtc buses, md vc sajjanar strong warning kms
Author
First Published Dec 18, 2023, 3:53 PM IST

TSRTC: బిగ్ బాస్ పై అభిమానం పెరిగి విపరీతాలకు దారి తీస్తున్నది. బిగ్ బాస్ సీజన్ 7 తర్వాత అభిమానులు అల్లరి చేశారు. కృష్ణానగర్‌లో పిచ్చి చేష్టలు చేసి ప్రజా ఆస్తిపై దాడి చేశారు. అటు వచ్చిన ఆర్టీసీ బస్సులపై దాడికి దిగారు. ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సీరియస్ అయ్యారు.

బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ విజేత‌ను ప్రకటించారు. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ సీజన్ 7 విన్నర్‌గా నిలిచాడు. రన్నరప్‌గా సీరియల్ నటుడు అమర్‌దీప్ ఉన్నాడు. ప్రశాంత్ అభిమానులు గెలుపును వేడుక చేసుకున్నారు. బిగ్ బాస్ షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియోస్‌కు పెద్ద సంఖ్యలో వీరిద్దరి అభిమానులు తరలివచ్చారు. ప్రశాంత్ విజేత అని ప్రకటించగానే ఆయన అభిమానులు గంతులేశారు. అక్కడికి వచ్చిన అమర్‌దీప్ అభిమానులకు, ప్రశాంత్ అభిమానులకు మధ్య వాగ్వాదం మొదలై గొడవకు దారి తీసింది.

ఈ గొడవ శృతిమించింది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. అంతేకాదు, అటుగా వెళ్లుతున్న ఆర్టీసీ బస్సులపై దాడి చేశారు. సుమారు 6 ఆర్టీసీ బస్సుల అద్దాలు పగులగొట్టారు. ఈ ఘటనపై ఆర్టీసీ అధికారులు పోలీసు కేసు పెట్టారు. పోలీసులు స్పాట్‌కు వచ్చి వారిని చెదరగొట్టారు. నిర్వాహకులపై కేసు ఫైల్ చేశారు.

Also Read : Corona Cases: 89 శాతం కరోనా కేసులు కేరళ నుంచే, చర్యలు శూన్యం: పినరయి సర్కారుపై విపక్షం ఫైర్

కాగా, ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. ‘ఇదేం అభిమానం! బిగ్ బాస్-7 ఫైనల్ సందర్భంగా హైదదాబాద్‌ లోని కృష్ణానగర్‌ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి TSRTC కి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేసి.. దర్యాప్తు చేస్తున్నారు. 

అభిమానం పేరుతో చేసే పిచ్చి చెష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదు. ప్రజలను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్టే. ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. టీఎస్ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’ అంటూ సజ్జనార్ ఫైర్ అయ్యారు. ఈ ట్వీట్‌లో నాగార్జున, స్టార్ మా ట్విట్టర్ హ్యాండిళ్లను కూడా ట్యాగ్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios