హైదరాబాద్: తెలంగాణపై టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెసు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. వైఎస్ జగన్ ను ఢీకొట్టడానికి సోనియా గాంధీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేశారని ఆయన అన్నారు. జానారెడ్డిని గానీ జైపాల్ రెడ్డిని గానీ ముఖ్యమంత్రిగా చేయాలని తాను సోనియాతో చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు.

కాంగ్రెసుకు నాయకత్వం లేకుండా ఆంధ్ర నాయకులే చేశారని ఆయన అన్నారు. తెలంగాణ నాయకులను బలహీనపరిచింది రాయలసీమ నేతలేనని ఆయన అన్నారు మగవారిని ఇంట్లో కూర్చోబెట్టి ఆడవాళ్లకు మంత్రి పదవులు ఇచ్చారని ఆయన అన్నారు. 

రాయల తెలంగాణకు తాము కూడా మద్దతు ఇచ్చినట్లు రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తెలంగాణపై రాజగోపాల్ రెడ్డికి, జేసీ దివాకర్ రెడ్డికి మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది.

తెలంగాణ ఇచ్చి కాంగ్రెసు తప్పు చేసిందని జేసి దివాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణ కాంగ్రెసుకు కాలం చెల్లిందని ఆయన అన్నారు. కాంగ్రెసు నేతలంతా కలిసి పార్టీని చంపేశారని ఆయన అన్నారు. తెలంగాణలో కాంగ్రెసు అధికారంలోకి రాలేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి అయిపోదామని కాంగ్రెసును చంపేశారని ఆయన వ్యాఖ్యానించారు 

చివరి వరకు తాము మాజీ కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డిని నమ్మినట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటికీ బంగారు తెలంగాణ రాలేదని ఆయన అన్నారు.