భార్య కోసం తరచూ అత్తారింటికి వస్తున్న ఓ భర్తను మామ హత్య చేయడంతో .. జనగామ జిల్లా చీటకోడూరు గ్రామంలో ఉద్రిక్త  పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన ఉదయ్ అనే యువకుడు.. జనగామ జిల్లా చీటకోడూరు గ్రామానికి చెందిన మౌనికను ప్రేమించాడు.. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో..పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు.

తల్లిదండ్రులకు దూరంగా హైదరాబాద్‌లో వేరు కాపురం పెట్టాడు. అయితే కొన్నాళ్లకు ఉదయ్ తల్లిదండ్రులు అతన్ని భార్యతో పాటు ఇంటికి ఆహ్వానించారు. కొన్నాళ్ల పాటు భార్యాభర్తలిద్దరూ సంతోషంగా నే ఉన్నారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ ఇద్దరి మధ్య కలహాలు మొదలవ్వడంతో మౌనిక తన భర్తను వదిలి పుట్టింటికి వచ్చేసింది. తన భార్యను ఒప్పించి తిరిగి తన ఇంటికి తీసుకొచ్చేందుకు తరచుగా చీటకోడూరులోని అత్తవారింటికి వెళ్లేవాడు.

ఈ క్రమంలో అబ్బాయి, అబ్బాయి తరుపున కుటుంబసభ్యులు పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించి.. అబ్బాయి తరపున అమ్మాయికి రూ.1.50 లక్షల పరహారం ఇచ్చి విడాకులు తీసుకోవాలని చెప్పారు. కోడల్ని తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని.. మేమేందుకు డబ్బులివ్వాలని ఉదయ్ తల్లిదండ్రులు చెప్పారు. ఎప్పటిలాగానే గత ఆదివారం రాత్రి భార్య ఇంటికి వెళ్లాడు.. ఆ తెల్లారి దారుణ హత్యకు గురయ్యాడు...

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఉదయ్ తల్లిదండ్రులు, బంధువులు పెద్ద సంఖ్యలో జనగామ ప్రభుత్వాసుపత్రికి చేరుకుని.. పోలీసులతో వాగ్వావాదానికి దిగారు.. కుటుంబసభ్యులు రాకుండా మృతదేహాన్ని ఆసుపత్రికి ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు.. సిద్ధిపేట హైవేపై రాస్తారోకోకు దిగారు.

అనంతరం మౌనిక ఇంటికి చేరుకుని ఆమె ఇంటిలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి.. ఇంటికి నిప్పు పెట్టే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. మౌనిక తల్లిదండ్రులతో పాటు ఇతర కుటుంబసభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.