హైదరాబాద్: హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన సంగీత లాంటి ఉదంతం మరోసారి వెలుగులోకి వచ్చింది. పటాన్ చెరులో భార్య, అత్తమామలపై తన సోదరుడితో కలిసి దాడికి పాల్పడ్డాడు ఓ భర్త. భర్త దాడిపై పటాన్ చెరు పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య. 

వివరాల్లోకి వెళ్తే హయత్ నగర్ కు చెందిన అనూషకు పటాన్ చెరుకు చెందిన రఘురామిరెడ్డి అనే వ్యక్తితో రెండేళ్ల క్రితం వివాహం అయ్యింది. పెళ్లైన కొన్నిరోజులు సజావుగా కాపురం చేసిన రఘురామిరెడ్డి అనంతరం భార్యను వేధించడం మెుదలుపెట్టాడు. 


తనను తన భర్త వేధిస్తున్నాడని నిత్యం కొడుతున్నాడని అనూష తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి బోరున విలపించేది. అనంతరం తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే ఇరువర్గాల పెద్దలు రాజీ కుదర్చడంతో శనివారం అత్తింటికి కాపురానికి వెళ్లింది అనూష. తనతోపాటు తనతల్లిదండ్రులను కూడా వెంటబెట్టుకుని వెళ్లింది. 

అయితే ఇంట్లోకి అడుగుపెట్టిన భార్య, అత్తమామలపై దాడికి దిగాడు అల్లుడు రఘురామిరెడ్డి. అల్లుడు రఘురామిరెడ్డితోపాటు అతని తల్లిదండ్రులు, సోదరుడు కర్రలతో దాడికి దిగాడు. రఘురామిరెడ్డి బెల్ట్ తో తీవ్రంగా కట్టాడు. స్థానికులు వచ్చి అడ్డుకున్నారు. 

భర్త ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోగా తీవ్రంగా గాయపరచడంతో అవాక్కైన అనూష, ఆమె తల్లిదండ్రులు పటాన్ చెరు పోలీసులను ఆశ్రయించారు. తన భర్తపై ఫిర్యాదు చేశారు. ఇకపోతే రఘురామిరెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.