భార్య తల్లిపై ఆన్‌లైన్‌లో అసభ్యంగా పోస్టులు చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్  చేశారు. వివరాల్లోకి వెళితే.. వరంగల్ సమీపంలోని కమలాపూర్ శంభునిపల్లికి చెందిన దుబాసి సునీల్ విశాఖటపట్నంలోని ఎన్టీపీసీ‌లో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.

2007లో ఇతనికి భువనగిరికి చెందిన యువతితో పెళ్లయ్యింది. వివాహం జరిగిన కొంతకాలానికే భార్యభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరిగాయి. క్రమేపీ అవి పెరిగి పెద్దవయ్యాయి. తన కాపురంలో గొడవలు రావడానికి అత్తగారే కారణమని... ఆమె తనపై లేనిపోనివి నూరిపోసి గొడవలు సృష్టిస్తుందని సునీల్ అనుమానించాడు.

దీంతో అత్తగారిపై కక్ష పెంచుకున్నాడు. అత్త గురించి అసభ్యంగా రాస్తూ ఆమె ఫోన్ నెంబర్‌ను ఆన్‌లైన్‌లో అశ్లీల వెబ్‌సైట్‌లో ఉంచాడు. దీంతో అతని అత్తకు అపరిచితుల నుంచి అసభ్యకరమైన ఫోన్ కాల్స్ రావడం ప్రారంభమైంది.

అంతటితో ఆగకుండా వాట్సాప్ ద్వారా బంధువులకు సైతం అసభ్య సందేశాలు పంపాడు. దీంతో తీవ్ర మానసిక క్షోభకు గురైన బాధితురాలు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా.. సొంత అల్లుడే నిందితుడని తేలింది. దీంతో పోలీసులు సునీల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.