విషాదం.. హైదరాబాద్ లో క్రికెట్ ఆడుతూ గుండెనొప్పితో టెకీ మృతి..!
క్రికెట్ ఆడిన తరువాత గుండెల్లో నొప్పి రావడంతో 31 సంవత్సరాల ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగింది.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్‌లో స్నేహితులతో క్రికెట్ గేమ్ ఆడుతూ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఛాతీ నొప్పితో మృతి చెందాడు. ఈ మేరకు పోలీసు అధికారులు ఆదివారం తెలిపారు. సనత్‌నగర్‌లో నివాసం ఉంటున్న 31 ఏళ్ల సంజీవ్‌రెడ్డి శనివారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి ఉదయం 11.30 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌లో క్రికెట్ ఆడాడు. ఆట తరువాత సాయంత్రం 4 గంటల సమయంలో మైదానం నుంచి బయలుదేరిన తర్వాత ఈ ఘటన జరిగిందని బేగంపేట పోలీసు అధికారులు తెలిపారు.
సంజీవ్ రెడ్డి తీవ్రమైన ఛాతీ నొప్పి వస్తుందని తన స్నేహితులకు ఫిర్యాదు చేసిన వెంటనే, వారు అతనిని బేగంపేటలోని కిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. హుటాహుటిన తీసుకువెడుతుండగానే మార్గమధ్యంలోనే సంజీవ్ రెడ్డి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.అతని స్నేహితులు సంజీవ్‌రెడ్డికి కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (సీపీఆర్) నిర్వహించారు. ఆ తరువాత ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
నేడు ఐటీ అధికారుల విచారణకు మంత్రి మల్లారెడ్డి దూరం!.. హాజరుకానున్న కుటుంబ సభ్యులు..
"సంజీవ్ రెడ్డికి హైపర్ టెన్షన్ ఉంది. అతనికి ఒంట్లో నలతగా ఉన్నా శనివారం హాలీడే కాబట్టి క్రికెట్ ఆడటానికి తన స్నేహితులతో కలిసి మైదానానికి వచ్చాడు’’ అని బేగంపేట ఇన్స్పెక్టర్ పి శ్రీనివాసరావు తెలిపారు. సంజీవ్ రెడ్డికి రెండేళ్ల క్రితం వివాహమయ్యింది. అతను కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో ఉంటున్నాడు. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా. పోలీసులు ఆయన మృతిని సెక్షన్ 174 (అనుమానాస్పద మృతి) కింద కేసు నమోదు చేశారు. చట్టపరమైన లాంఛనాలు పూర్తయిన తర్వాత, పోలీసు అధికారులు సంజీవ్ రెడ్డి మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఇదిలా ఉండగా, ఇటలీలో ఉన్నత విద్య కోసం వెళ్లి అక్కడే మృతి చెందిన విద్యార్థి మృతదేహాన్ని 22 రోజుల తర్వాత నగరానికి తీసుకు వచ్చారు. వివరాల్లోకి వెళితే పద్మారావు నగర్ బంజారా అపార్ట్మెంట్లో ఉంటున్న పి. రామచంద్రుడు కుమారుడు పి. వెంకట సాయి ఉదయ్ కుమార్ (28) ఉదయ్ కుమార్ ఇటలీ దేశంలో చదువుతున్నాడు. ఈనెల 4న ఆ దేశంలోని ఓ ఆస్పత్రి నుంచి కుటుంబ సభ్యులకు కుమారుడు చనిపోయినట్లు ఈమెయిల్ వచ్చింది. దానిని చదివిన తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు.
మృతదేహాన్ని తీసుకు వచ్చేందుకు స్థానిక కాలనీ వాసులతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిశారు. ఆయన ప్రమేయంతో 22 రోజుల తర్వాత శనివారం పదకొండున్నర గంటలకు వెంకటసాయి కె ఉదయ్ కుమార్ మృతదేహం నగరానికి తీసుకొచ్చారు డివిజన్ కార్పొరేటర్ కుర్మా హేమలత, కాలనీ అధ్యక్షుడు మామిడి బాల్ రెడ్డి మృత దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లోయర్ ట్యాంక్ బండ్ రోడ్డు సమీపంలోని స్మశాన వాటికలో అంత్యక్రియలు చేశారు.
సికింద్రాబాద్, పద్మారావునగర్‌లోని బంజారా అపార్ట్‌మెంట్‌కు చెందిన పి. ఉదయ్ కుమార్ (28) మొదటిసారిగా 2018లో ఇటలీకి వెళ్లాడు. 2020లో రోమ్‌లోని సపియెంజా యూనివర్శిటీలో MS పూర్తి చేశాడు. ఆ తరువాత కోవిడ్-19 సమయంలో నగరానికి తిరిగి వచ్చాడు. పరిస్థితి మెరుగుపడిన తరువాత, 2021 లో ఉన్నత చదువుల కోసం తిరిగి ఇటలీ వెళ్లాడు. రోమ్‌లో ఓ రూంలో షేరింగ్ లో ఉంటున్నాడు.
నవంబరు 4న హైదరాబాద్ లోని అతని కుటుంబ సభ్యులకు ఉదయ్ కుమార్ మృతి చెందినట్లు ఇమెయిల్ వచ్చింది. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అక్కడ ఉన్న అతని రూమ్‌మేట్‌లు, ఇతర స్నేహితులను సంప్రదించారు, కానీ పెద్దగా సమాచారం అందలేదు. ఉదయ్ కుమార్ తల్లిదండ్రులు, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి పి. రామచంద్ర, పి. రాజేశ్వరిలు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలుసుకుని, మృతదేహాన్ని త్వరగా భారతదేశానికి తీసుకురావడానికి సహాయం చేయమని అభ్యర్థించారు.