Asianet News TeluguAsianet News Telugu

నేడు ఐటీ అధికారుల విచారణకు మంత్రి మల్లారెడ్డి దూరం.. హాజరుకానున్న కుటుంబ సభ్యులు..

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో, విద్యాసంస్థల్లో ఐటీ అధికారులు రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించిన సంగతి  తెలిసిందే. అనంతరం విచారణకు రావాల్సిందిగా మల్లారెడ్డితో మరో 16 మందికి ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
 

Minister Malla Reddy Likely Skip IT Official Inquiry today
Author
First Published Nov 28, 2022, 9:36 AM IST

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి నేడు ఐటీ అధికారుల విచారణకు దూరంగా ఉండనున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల ఐటీ అధికారులు రెండు రోజుల పాటు మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో, విద్యాసంస్థల్లో సోదాలు నిర్వహించిన సంగతి  తెలిసిందే. ఈ సోదాల్లో ఐటీ అధికారులు దాదాపుగా రూ. 15 కోట్ల నగదు, పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. పన్ను ఎగవేత, మేనేజ్ మెంట్ కోటా కింద సీట్ల అమ్మకాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు.

సోదాల అనంతరం మంత్రి మల్లారెడ్డితో మరో 16 మందికి ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సోమవారం (నవంబర్ 28) విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే నేడు మల్లారెడ్డి ఐటీ విచారణకు దూరంగా ఉండనున్నారు. అయితే మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి సహా పలువురు కుటుంబ సభ్యులు ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఐటీ అధికారుల విచారణకు హాజరుకానున్నారు.

ఐటీ అధికారుల విచారణకు హాజరుకాకపోవడంపై స్పందించిన మంత్రి మల్లారెడ్డి.. తన తరుపున ఆడిటర్ విచారణకు హాజరవుతారని చెప్పారు. తాను ఉప్పల్లో జరిగే  పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున ఐటీ విచారణకు వెళ్లలేకపోతున్నాని అన్నారు. తన కుటుంబ సభ్యులు  ఐటీ ఎదుట విచారణకు హాజరవుతారని చెప్పారు. ఐటీ అధికారులు తనను వదిలిపెట్టిన.. మీడియా వదలడం లేదంటూ కామెంట్ చేశారు.

ఇక, ఐటీ రైడ్స్ ముగిసే సమయంలో హైడ్రామా చోటుచేసుకుంది. మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులు, ఐటీ అధికారులు పరస్పరం ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్‌ నుంచి కొన్ని పత్రాలపై బలవంతంగా సంతకాలు తీసుకున్నారంటూ ఐటీ అధికారి రత్నాకర్‌పై మల్లారెడ్డి చిన్న కుమారుడు భద్రారెడ్డి గురువారం తెల్లవారుజామున పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ ఐటీ అధికారి రత్నాకర్‌ బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రెండు కేసులను జీరో ఎఫ్‌ఐఆర్‌లుగా నమోదు చేసి దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి వచ్చినందున కేసును బదిలీ చేసినట్టుగా బోయిన్‌పల్లి పోలీసులు తెలిపారు. 

ఇదిలా ఉంటే ఆదివారం సిద్దిపేట జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఐటీ దాడులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. 2024లో కేంద్రంలో కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఒక మహాత్ముడని, గొప్ప వ్యక్తి అని అన్నారు. అంబేడ్కర్ తర్వాత పేద ప్రజలకు మంచి చేసింది ఎవరైన ఉన్నారంటే అది కేసీఆర్ మాత్రమేనని చెప్పారు. ఐటీ దాడులకు భయపడేది లేదని.. తన వెంట సీఎం కేసీఆర్ ఉన్నారని చెప్పారు. కేసీఆర్ తన వెంట ఉన్నంతవరకూ ఏ రైడ్‌లకు భయపడనని చెప్పారు. 2024లో ఢిల్లీలోని ఎర్రకోట మీద కేసీఆర్ జెండా ఎగరవేస్తారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేశం మొత్తం ఇన్‌కమ్ ట్యాక్స్ రియలైజ్ చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వం వస్తే ఐటీ దాడులు చేయడం ఉండదన్నారు. ప్రతి ఒక్కరు ఎంతైనా సంపాదించుకోవచ్చని అన్నారు. ఎవరికి వారే స్వచ్చందంగా ట్యాక్స్ చెల్లించేలా కేసీఆర్ రూల్స్ తీసుకోస్తారని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios