Asianet News TeluguAsianet News Telugu

కేసిఆర్ తిట్ల భాషకు ప్రొఫెసర్ సమాధానం

  • కేసిఆర్ తిట్ల భాషకు ప్రొఫెసర్ భాషలో కోదండరాం సమాధానం
  • కేసిఆర్ తిట్లన్నింటిని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా
  • కుటుంబ పాలన, జాగిర్దార్ పాలనపై పోరాటం కొనసాగిస్తాం
  • 500 మంది రాకపోతే ఇంత నిర్బంధం ఇంత దాడి ఎందుకో? వాళ్లే చెప్పాలి
sober professor kodandaram debunks kcrs telangana claims

నిన్న తెలంగాణ సిఎం వాడు, వీడు, లంగా అంటూ ఘాటైన భాషలో కోదండరాంపై విమర్శలు చేశారు. కానీ కోదండరాం ఇవాళ పూర్తిగా అందుకు విరుద్ధమైన భాషలో సమాధానం చెప్పారు. ఎక్కడా మాట తూలకుండా కేసిఆర్ లేవనెత్తిన మాటలకు సమాధానం చెప్పారు కోదండరాం. కోదండరాం మాట్లాడిన మాటలు ఒకసారి చదవండి.

సీఎం కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ విషయమై రాత్రి చాలా సేపు చర్చించాం. టీజేఏసి సాంప్రదాయాలకు లోబడి మాట్లాడాలనే నిర్ణయం తీసుకున్నాం.

సీఎం స్థాయి వ్యక్తి అలాంటి బాష మాట్లాడొద్దు. వ్యక్తిగత ధూషణలకు దిగడం సరికాదు.

ప్రజాస్వామ్య విలువలు, సాంప్రదాయాలకు లోబడి మాట్లాడాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏ ఒక్క వ్యక్తితోనో రాలేదు.

అందరూ భాగస్వాములయ్యారు. 1200 మంది అమరులయ్యారు... 600మంది బలిదానాలు చేసుకున్నారు.

ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాడుతున్నాం. తెలంగాణ లో అసమానతలను తొలగించి ప్రజాస్వామ్య తెలంగాణ కోసం ప్రయత్నిస్తున్నాం.

అమరుల ఆకాంక్షలు అమలు కావాలనే కొట్లాడుతున్నాం. ప్రభుత్వం ప్రజలకోసం పనిచేయాలి.

 బడుగు, బలహీన వర్గాలకు, మహిళలకు తగిన గౌరవం దక్కాలి.
నిన్న సిఎం కేసిఆర్ గారు మాట్లాడిన భాష, పదజాలం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను. అధికారాన్ని కబ్జాలకు వాడుతున్నారు.

ఏ ఒక్కరో కొట్లాడితే తెలంగాణ రాలేదు. వచ్చిన తెలంగాణను బాగు చేసుకునేందుకు ప్రయత్నాలు జరగడంలేదు.

పాత ఉన్నతమైన సాంప్రదాయాలను వదిలేసి అమ్ముడు, కొనుడు సాంప్రదాయానికి బాటలు వేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం.

ఎక్కడ కూడా సంబంధిత నిపుణులతో చర్చించే సాంప్రదాయాలు పోయాయి.

మంత్రులు, ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు. అధికారమంతా సిఎం చేతిలో హస్తగతమైంది.

మంత్రివర్గంలో సామాజిక సమతుల్యం లేదని మేము బాధపడుతుంటే ఉన్న మంత్రులకు కూడా అధికారాలు లేవు.

మంత్రేమో బయట తిరుగుతడు.సంబంధిత శాఖపై అధికారులతో కుసోని సిఎం రివ్యూ చేస్తడు. ఇక్కడ మంత్రులకేం విలువ ఉంది.

పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో పాలన ఒక కుటుంబం పాలైపోయిందన్నదే మా బాధ.

సిఎం ఏమో ఎప్పుడూ సచివాలయం రాడు. ఒక ఇల్లు ఉండగా మరో విశాలమైన భవనం నిర్మించుకుండు.

ఆ విశాలమైన భవనంలో కలవడానికి అవకాశం లేదని నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరినీ కలవడు. ఎవరి బాధలు పట్టించుకోడు.

అప్రజాస్వామికమైన పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు విరుద్ధంగా నిర్ణయాలు జరుగుతున్నాయి.

జనగామలో ఏం జరిగిందో మీరు చూశారు. అక్కడ ఎమ్మెల్యే భూ కబ్జాలకు పాల్పడుతున్న విధానాన్ని కలెక్టర్ చెప్పినా ఎమ్మెల్యే పై చర్యలు లేవు.

సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చెప్పనక్కరే లేకుండా అక్రమాలు జరుగుతున్నాయి.

మిషన్ భగీరథలో విచిత్రంగా పైపుల సైజులు ఉన్నాయి. చాలాచోట్ల అవసరం లేకున్నా పైపులైన్లు వేశారు. మంచినీటి పథకాలు ఉన్నప్పటికీ ఊడబీకి పైపులేస్తున్నారు.

ఈ రకమైన ఖర్చుల కోసం సర్కారు అప్పులు విచ్చలవిడిగా తెస్తున్నది.

రాష్ట్రం అప్పులు 2లక్షల కోట్లకు చేరుకున్నది. తెలంగాణ బంగారు తెలంగాణ ఐతదనుకుంటే అప్పుల తెలంగాణ అయితున్నది.  

ఫీజు రీయంబర్స్ మెంట్ విడుదల చేయలేదు.

ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లించలేదు.

డబుల్ బెడ్రూమ్ ఇండ్లు చెప్పినన్ని కట్టిస్తలేరు.

ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు మంజూరు చేసేదే లేదు.

దళితులకు మూడెకరాల భూమి అందదు.

విద్య, వైద్యం అందడానికి సదుపాయాలు లేవు.

ప్రసవానికి వచ్చిన పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నా. నిధులు లేవు. సౌకర్యాలు లేవు. మందులు లేవు. ఉన్న మందుల టెండర్లలో అవకతవకలు జరుగుతున్నాయి.

రైతులకు కావాల్సిన రుణమాఫీ పథకం వడ్డీలు వేయనేలేదు. ప్రభుత్వం ఇచ్చిన సగం డబ్బులు అప్పుల కిందికే పోయినయి రైతులకు. కేంద్రం ఇచ్చిన 800 కోట్లు కూడా రైతులకు చేరనేలేదు.

పంటలకు నష్ట పరిహారం అందనేలేదు. ధరల స్తిరీకరణ కోసం నిధులు పెట్టమంటే ఇప్పటి వరకు పెట్టలేదు.అందరం అడిగినా ప్రభుత్వం స్పందించలేదు.

అది లేక మిర్చి, కంది రైతులు , సోయా, పెసర రైతులు ఎలా నష్టపోయిర్రో, ఎట్ల అప్పులపాలయ్యిర్రో అదరికీ తెలుసు.

వీటిని ప్రశ్నించినందుకు ప్రభుత్వానికి కోపమొస్తుంది. మేము ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం వ్యక్తిగతంగా తీసుకుని దాడి చేస్తున్నది.

ప్రశ్నిస్తే 144 సెక్షన్, 151 కింద అరెస్టు అంటరు. సెక్షన్ 30 అంటరు. విచ్చలవిడిగా ఈ సెక్షన్లను ఉపయోగించి అరెస్టు చేస్తున్నరు.

హైదరాబాద్ లో ధర్నా చౌక్ ఎత్తేసిర్రు.

సోషల్ మీడియా మీద కంట్రోల్ పెడతామంటున్నరు. 500 కోట్లు అడ్వర్టైజ్ మెంట్లు పెట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియా నోరు మూపిచ్చిర్రు. ఇప్పుడు అడ్వర్టైజ్ మెంట్లతోటి పనిలేదని సోషల్ మీడియాను బెదిరిస్తున్నరు.

నేరెళ్లలో ఇసుక లారీలను నియంత్రించమని అడిగినందుకు దెబ్బలు కొట్టి కేసులు పెట్టిర్రు. వేధింపులకు గురి చేస్తున్నారు. ఇసుక మాఫియాను నియంత్రించే పనిచేయలేదు. ఈ ప్రభుత్వం ఇసుక మాఫియా చేతిలో ఎలా ఉందో తెలుస్తుంది.

కాంట్రాక్టులన్నీ ఆంధ్రా కాంట్రాక్టర్లకే దొరుకుతున్నాయి. సబ్ కాంట్రాక్టర్ కింద సబ్ కాంట్రాక్టర్ తెలంగాణవాడు ఉంటాడు. ప్రజలకు ప్రభుత్వం దూరమైంది. ఇసుక మాఫియా, ఆంధ్రా కాంట్రాక్టర్లకు దరగ్గరైంది.

ఆంధ్రా కార్పొరేట్ విద్యా సంస్థలకు దగ్గరికి కూడా పోతలేరు. తనిఖీలు చేస్తలేరు. తెలంగాణ కాలేజీలు, బళ్లకు మాత్రం బెదిరిస్తున్నరు.

ఉద్యమ శక్తులేమో పరాయివాళ్లు అయిర్రు. ఉద్యమ ద్రోహులేమో సొంతవాళ్లు అయిపోయిర్రు.

పాపం తాండూరులో అయూబ్ ఖాన్ తిరిగి తిరిగి వేసారిండు. ఆయనకు న్యాయం చేయలేదు. బాధలు తట్టుకోలేక పెట్రోలు పోసుకుని అంటుపెట్టుకున్నడు.

ఇయ్యాల నారాయణపేటలో శ్రీనివాస్ అనే కార్యకర్త సెల్ టవర్ ఎక్కిర్రు. ద్రోహులు మాత్రం దోస్తులయ్యిర్రు. సొంత పార్టీ కార్యకర్తలే పరాయోళ్లు అయిర్రు.

ఎవరి పాలైందిరో తెలంగాణ అనే పాట ఇలాంటి అనుభవాల నుంచే పుట్టినది.

అమరుల కలను సాఫల్యం చేయడానికి మేము బయలుదేరినం. మా పోరాటం కొనసాగుతది.

ఉద్యమ కాలంలో బలిదానం చేసుకున్న వారి సూసైడ్ నోట్లు చదివితే తెలంగాణ వస్తే ఉద్యోగం వస్తదని రాసుకున్నరు.

మూడున్నరేళ్లు గడిచిన తర్వాత సిఎం ఏమంటారంటే డిఎస్సీ వేయకపోతే ప్రపంచం మునిగిపోతదా అని అంటున్నడు.

కొలువుల కొట్లాట జరపొద్దట. నిరుద్యోగులు మీటింగ్ కే రావొద్దంటడు.  అధికారంలో ఉన్న వ్యక్తులు సాంప్రదాయ వాతావరణం నెలకొల్పాలి.

లోకల్ రిజర్వేషన్ సమస్య జఠిలమైందని సిఎం అంటడు. తొందరపడి జిల్లాలు చెయ్యకురి అని అందరం నెత్తి నోరు కొట్టుకుని మొతతుకున్నం కదా? ఇన్నరా? అయినా తొందరపడి జిల్లాలు చేసి సమస్య ఝటిలం చేసింది మీరే కదా?

కొలువుల కొట్టాల సభకు హాజరు కావొద్దనడ అప్రజాస్వామికం.

జాగిర్దార్ల వలే సిఎం పాలిస్తున్నడు. అందుకే మామీద అక్కస్సు.

పాలన ప్రజాస్వామ్య పద్ధతుల్లో సాగాలి.

అండర్ గ్రౌండ్ మైన్లను తవ్వండి. పర్యావరణం కాపాడండి.

ఇట్లాంటి దాడులు ఉద్యమ కాలంలో ఆంధ్రా పాలకుల నుంచి కూడా చూసినం.

కానీ తెలంగాణ సొంత రాష్ట్రంలో కూడా ఈ దాడులు చూస్తున్నం.

ప్రజాస్వామ్య ఉద్యమ ఆకాంక్షల కై మేము పోరాటం కొనసాగిస్తాం.

తెలంగాణ ప్రజలకు అటో ఇటో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. జెఎసి సమరాలకు, ప్రయత్నాలకు అందరు సహకారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.

నిరంకుశ కుటుంబ పాలన పోవాలని మేము కోరుకుంటున్నం. దానికోసమే ప్రయత్నం కొనసాగుతుది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఆటంకాలు ఎదురైనా జెఎసి పోరాటం ఆగదు.

ఏ శక్తీ మమ్మల్ని ఆపలేదు అని స్పష్టం చేస్తున్నాం. ఉన్నతమైన విలువలకు కట్టుబడి పనిచేస్తది జెఎసి.

తెలంగాణ జెఎసి కోసం కేసిఆర్ చొరవ తీసుకున్నారు. జెఎసి ఏర్పాటైంది. కానీ అంతకుముందే జనాలు జెఎసిలుగా ఏర్పాటై ఉద్యమంలో ఉన్నారు. జయశంకర్ సూచన మేరకు నా పేరు ప్రతిపాదన వచ్చింది. అందరూ ఒప్పుకున్నారు.

అయినా ఇక్కడొక ముచ్చట చెప్తా. పర్షియన్ కవి ఒకాయన అంటాడు. తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తారు. కానీ జన్మనిచ్చినంత మాత్రాన అధికారం ఉంటదని అనుకుంటే అత్యాశే అని.

సమిష్టి ప్రయత్నం కోసమే జెఎసి ఆవిర్భవించింది. ఆ ప్రయత్నంలో అందరూ కీలకమైన పాత్ర పోశించారు. ఎవరినీ తక్కువగా చేయాల్సిన అవసరం లేదు.

సిఎం చాలా విషయాలు వ్యక్తిగతంగా చూస్తున్నారు. అదే చాలా తప్పుడు ఆలోచన.

నా గురించి నేను ఏం ఆలోచించుకుంటున్న. సమాజం కోసం చేయవల్సిన పనులు సమాజం నేపథ్యంలోనే చేస్తం కానీ. ఎక్కువ తక్కువ ఊహించుకుంటే సంస్థలు బతుకుతయా?

ఇష్టం వచ్చినట్లు నేను ఊహించుకుని పనిచేస్తే జెఎసి బతుకుతదా?

నేను మొదటి నుంచి తెలంగాణకు అనుకూలం, ప్రజలకు అనుకూలం. ప్రజలకు అనుకూలమైన పనులే చేసినం. చేస్తం.

కాంగ్రెస్ మేనిఫెస్టో మేమే రాసినం అంటున్నరంటే మేము జెఎసి తరుపున ఒక మేనిఫెస్టో రాసినం అన్ని పార్టీలకు ఇచ్చినం. కొందరు పాటించిర్రు. కొందరు చిత్తు కాగితాల లెక్క చెత్త బుట్టల ఏసిర్రు.

సిఎం గారు ఉద్యమకాలంనాటి విషయాలను వక్రీకరించి చెప్పడమంటే తెలంగాణ ఉద్యమాన్ని అవమానించడం తప్ప మరొకటి కాదు. ఈ ఉద్యమం చాలా మందిని వక్తలుగా, నాయకులుగా శక్తులుగా తయారు చేసింది. నేరుచుకున్నవారు ఎదిగిర్రు.

సింగరేణి కార్మికులు విజయం సాధించిర్రు. అనేక సమస్యలను ఎజెండా లోకి తీసుకొచ్చిర్రు. సింగరేణిలో గెలిచిర్రని చెప్పేవాళ్లు తాడిచెర్ల ప్రయివేటీకరణ అబద్ధమానండి? చెప్పమనండి? తాడిచెర్ల ప్రయివేటీకరణ రద్దు చేసి సింగరేణికి ఇవ్వమనండి? కార్మికులకు లాభాల్లో వాళ్లకు వాటా వచ్చాయి కదా? ఆ విజయం కార్మికులకు చెందుతుంది.

నేను ఇష్టపూర్వకంగా ఒక పని ఎంచుకున్న. వత్తిడికి లొంగి కాదు. ఎమర్జెన్సీ నుంచి నేను యూనివర్శిటీలో విద్యార్థిగా ఉన్న. అప్పటి నుంచి అనేకానేక సంఘాల్లో పనిచేశాను. జయశంకర్ లాంటి గురువులు మాకు కూడా ఉన్నారు కదా? వారి మాట మీద నిలబడే తెలంగాణ కోసం ఈ పనికి పూనుకున్నాం.

రాజకీయ పార్టీ పెట్టొచ్చు కదా???

రాజకీయం అంటే పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేసి పైసలు పంచితేనే రాజకీయమా? మేము చేసేది ఇప్పుడు రాజకీయమే. 2019లో పోటీ చేసే ముచ్చట ఇప్పుడు చెప్పలేం. ఆనాటి పరిస్థితి, సందర్భాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటాము.

మీ సభలకు 500 మంది రాట్లేరు కదా???

ఎవరు పిలుపులు ఏంటో. ప్రజలకు తెలుసు. మా సభలకు 500 మంది రాకపోతే ఇన్ని ఆంక్షలు ఎందుకండీ? మాపై ఇంత నిర్బంధం ఎందుకు పెడుతున్నరు.

ఎవనిపాలైందిరో అనే పాట మీద.???

పాలన తెలంగాణ కోసం కొట్లాడినోళ్లకు రావాలి. పాలన దారి తప్పినోళ్లకే వచ్చింది. అదే మాబాధ.

కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నారు కదా???

నిషిద్ధ సంస్థలు దేనితోనూ జెఎసి కలవదు. చట్టబద్ధమైన సంస్థలన్నింటితోనూ జెఎసి కలుస్తది. తెలంగాణ బాగు కోసం ఏ సంస్థతోటైనా కలుస్తది. తెలంగాణ రాకముందు కలవలేదా? ఇప్పుడు కూడా కలుస్తది.

భవిష్యత్తు కార్యాచరణ ఏంటి???

14, 15 తేదీల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6వ విడత అమరుల స్పూర్తి యాత్ర ఉన్నది. ఆ తర్వాత ఈనెల 21, 22న నల్లగొండ జిల్లాలో 7వ విడత యాత్ర ఉంది.

శంకరమ్మను పరామర్శించలేదు కదా????

శంకరమ్మకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చి ఉంటే అడిగే అర్హత ఆయనకు ఉంటది.

కొలువులకై కొట్లాట కోసం సోమవారం కమిషనర్ ను కలుస్తున్నం. నాలుగైదు స్థలాలు ఎంపిక చేసుకున్నం. వాటిలో ఎక్కడ పర్మిషన్ ఇస్తరో కమిషనర్ తోటి చర్చిస్తం.

ఇలా అన్ని అంశాలపై ప్రొఫెసర్ కోదండరాం మీడియాతో మాట్లాడారు.

Follow Us:
Download App:
  • android
  • ios