హైదరాబాద్: టీకాలు ఇప్పిస్తానని చెప్పి ఆరు రోజుల పసికందును ఆసుపత్రి నుండి ఎత్తుకెళ్లింది. ఈ ఘటన కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో చోటు చేసుకొంది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఎల్లమ్మ తండాకు చెందిన విజయ ప్రసూతి కోసం గత వారం కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో చేరింది. ఆమె  ఆడశిశువుకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత  ఆమె కదల్లేని స్థితిలో ఉంది.

ప్రస్తుతం ఆడశిశువు వయస్సు ఆరు రోజులు. పసిపాపకు టీకాలు వేయించాల్సి ఉంది. విజయ పరిస్థితిని గమనించిన ఓ మహిళ పాపకు టీకాను ఇప్పిస్తామని చెప్పి ఎత్తుకెళ్లింది. టీకా ఇప్పించేందుకు వెళ్లిన మహిళ ఎంతసేపటికీ రాకపోవడంతో   విజయ ఆసుపత్రికి సిబ్బందికి సమాచారం ఇచ్చింది.

ఆసుపత్రి సిబ్బంది స్ధానిక సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోఠి ఆసుపత్రిలోని సీసీటీవీ దృశ్యాల ఆధారంగా శిశువును  అపహరించిన మహిళను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

తమకు న్యాయం చేయాలని  బాధిత కుటుంబం పోలీసులను కోరుతోంది. అయితే ఈ వార్తను కవర్ చేసేందుకు ప్రయత్నించిన మీడియాపై పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది దురుసుగా వ్యవహరించారు.