కరీంనగర్: మానవత్వం, మానవ సంబంధాలను మచ్చ తెచ్చే దారుణ సంఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో చోటుచేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం కట్టుకున్న భార్య, కన్న కూతురు, కొడుకు ఓ సింగరేణి కార్మికుడిని అతి దారుణంగా హత్య చేశారు. అంతేకాకుండా ఈ దారుణాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు విశ్వప్రయత్నాలు చేసి చివరకు పాపం పండి పోలీసులకు చిక్కారు. 

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బెల్లంపల్లి  మండలంలోని పాత బెల్లంపల్లి గ్రామానికి చెందిన ముత్తె శంకరి(56) సింగరేణి కార్మికుడు.  శ్రీరాంపూర్‌ ఏరియాలోని ఆర్‌కె–7 గనిలో టింబర్‌మెన్‌గా విధులు నిర్వహించేవాడు. అయితే అతడు ఇటీవల అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు.

read more   ఐలవ్ యూ బావా...అని సూసైడ్ నోట్: పెళ్లైన ఆర్నెళ్లకే ఆత్మహత్య

అయితే అతడి మరణంపై కుటుంబసభ్యులే బిన్నమైన వాదనలు చేయడంతో పోలీసులకు అనుమానం కలిగింది. శంకరి భార్య, కొడుకు, కూతురు ఆత్మహత్య అంటే మృతుడి సోదరి మాత్రం హత్య చేశారని ఆరోపించారు. అయితే మృతుడి సోదరి రుక్మిణి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరపగా సంచలన నిజాలు బయటపడ్డాయి. 

కుటుంబసభ్యులతో గొడవపడి మంచిర్యాలలో వుండే శంకరి బెల్లంపల్లిలోని ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడంపై అనుమానంతో అతడి భార్య, కొడుకు, కూతురిని విచారించారు. దీంతో భయపడిపోయిన వారు అసలు నిజాన్ని భయటపెట్టారు. 

 శంకరి సర్వీస్ లో వుండగానే చనిపోతే ఈజీగా అతడి ఉద్యోగం కొడుకుకు వస్తుంది. దీంతో అతడిని అడ్డు తొలగించుకోడానికి తల్లీ, పిల్లలు కలిసి కుట్ర పన్నారు. కూతురికి కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పి మంచిర్యాల నుండి ఇంటికి రప్పించుకున్నారు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో అతడి గొంతుకు చీర బిగించి ఊపిరాడకుండా చేసి హతమార్చి అదే చీరతో వేలాడదీసి ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు తమదైన స్టైల్లో విచారణ జరిపి అసలు నిజాన్ని బయటకు లాగి నిందితులను అరెస్ట్ చేశారు.