హైదరాబాద్: తెలంగాణలో జరిగిన సిక్కిం మహిళ హత్య కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. మార్చి 16వ తేదీన చేవెల్ల సమీపంలోని తంగెళ్లపల్లి వద్ద సిక్కిం మహిళ దారుణ హత్యకు గురైన విషయాన్ని మరిచిపోయే ఉంటారు. దవాఫసిషర్పా అనే 37 ఏళ్ల సిక్కిం మహిళ హత్య కేసును పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఛేదించారు. 

ఆ కేసుకు సంబంధించిన వివరాలను శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. తంగెళ్లపల్లి వద్ద ఒంటిపై దుస్తులు లేకుండా గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని పోలీసులు అప్పట్లో గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. హత్య జరిగిన సమయం పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తెలిసింది. దాని ఆధారంగా ఆ సమయంలో ఒక రోజంతా ఆ మార్గంలో వచ్చిపోయిన వాహనాల వివరాలను పోలీసులు సేకరించారు. 

డ్రైవ్ ఈజీకి చెందిన ఓ అద్దె కారుపై అనుమానం వచ్చి ఆ సంస్థను సంప్రదించారు.. ఆ కారును అక్తర్ భారీ అనే వ్యక్తి అద్దెకు తీసుకున్నట్లు గుర్తించారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన అక్తర్ బారీ హైదరాబాదులోని గచ్చిబౌలిలోని హాస్టల్లో ఉంటూ బిటెక్ ఇంటర్న్ షిప్ చేస్తున్నాడు. అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. 

తను, వరుసకు తనకు సోదరుడయ్యే జానీ అక్తర్ కలిసి ఆ మహిళను చంపినట్లు అంగీకరించాడు. దాంతో అతన్ని కేసులో రెండో నిందితుడిగా గుర్తించి రిమాండ్ కు తరలించారు ముంబైలో ఉంటున్న జానీ అక్తర్ ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. జానీతో కలిసి ఆ మహిళ ముంబై నుంచి వచ్చినప్పుడు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో లభించిన సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలను సేకరించారు. జానీ అక్తర్ ను సోమవారం అరెస్టు చేశారు. 

సిక్కింకు చెందిన దవాఫసిషర్పాకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ముంబైలోని ఓ బట్టల షాపులో పనిచేసే ఉత్తరప్రదేశ్ కు చెందిన జానీ అక్తర్ ఆమెకు ఫేస్ బుక్ లో మూడేళ్ల క్రితం పిరచయమయ్యాడు. ఆ పరిచయంతో ఓసారి జాకీ సిక్కిం వెళ్లాడు. ఆ తర్వాత షర్పా కుటుంబ సభ్యులకు విషయం తెలిసింది. జానీని వారు మందలించారు. ఆ తర్వాత కూడా వారిద్దరి మధ్య ఫేస్ బుక్ చాటింగులు, ఫోన్ కాల్స్ నడిచాయి. 

చివరకు జనవరి 29వ తేదీన జానీ అక్తర్ సిక్కిం వెళ్లి షప్రాను ముంబైకి తీసుకుని వచ్చాడు. తనను పెళ్లి చేసుకోవాలని షర్పా అతనిపై ఒత్తిడి చేస్తూ వచ్చింది. దాంతో ఆమెను హత్య చేయడానికి ప్లాన్ వేశాడు. దానికి హైదరాబాదులో ఉంటున్న అక్తర్ భారీ సాయం తీసుకున్నాడు.

తాము స్థానికులం కాకపోవడంతో హైదరాబాదులో ఆమెను చంపేస్తే తప్పించుకోవచ్చునని జానీ అక్తర్ మార్చి 16వ తేదీన షర్పాతో కలిసి హైదరాబాదు వచ్చాడు. అప్పటికే డ్రైవ్ ఈజీ కారును అద్దెకు తీసుకున్న అక్తర్ బారీ వారి కోసం విమానాశ్రయం వెలుపల సిద్ధంగా ఉన్నాడు. చేవెళ్ల, తాండూరు, వికారాబాద్ వంటి ప్రదేశాల్లో కారులో ఆమెను తిప్పారు. అదేమిటని అడిగితే లాంగ్ డ్రైవ్ అని షర్పాకు చెప్పారు. 

ఫిర్జాగూడా వద్ద కారు అపీ షర్పా మెడకు తాడు బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని కారులో పెట్టుకుని తిరిగారు. అర్థరాత్రి ఒంటి గంటన్నర సమయంలో తంగెళ్లపల్లి వంతెన వద్ద శవాన్ని పారేశారు. ఒంటిపై దుస్తులుంటే గుర్తించడానికి వీలవుతుందనే ఉద్దేశంతో వాటిని తొలగించారు. ఆ తర్వాత బండరాయితో తలపై మోదారు. పొద్దుటూరు గేటు వద్ద మృతురాలి దుస్తులను పడేశారు.