బామ్మర్ది మోసమే ఈ బావ పెట్టుబడి... బయటపడుతున్న చక్రధర్ గౌడ్ లీలలు
సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ అసలు రంగు పోలీసుల విచారణలో బయటపడుతోంది. ఏకంగా కాల్ సెంటర్ ఏర్పాటుచేసిమరీ నిరుద్యోగులకు మోసగించాడు.
హైదరాబాద్ : కేసీఆర్ ప్రభుత్వం ధనికులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం భూములు కొన్నవారికి సైతం రైతుబంధు ఇస్తోదంటూ సిద్దిపేట కలెక్టరేట్ ముందు ప్లకార్డులతో నిరసన తెలిపిన చక్రధర్ గౌడ్ అందరికీ గుర్తుండే వుంటాడు. ఆ తర్వాత రైతులకు అతడు చేసిన ఆర్థిక సాయం సోషల్ మీడియాలో తెగ ప్రచారం కావడంతో బాగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత ఓ జాతీయ పార్టీలో చేరి రాజకీయ నాయకుడిగా మారాడు. ఇలా వ్యాపారవేత్తగా, సామాజికవేత్తగా, రాజకీయ నాయకుడిగా కలరింగ్ ఇచ్చిన చక్రధర్ గౌడ్ నిజానికి ఓ పెద్ద చీటర్ అని పోలీసులు గుర్తించారు. ఉద్యోగాల పేరిట వివిధ రాష్ట్రాలకు చెందిన యువతను మోసంచేసాడంటూ చక్రధర్ ను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసారు.
పోలీసుల విచారణలో చక్రధర్ గౌడ్ లీలలు ఒక్కోటిగా బయటపడుతున్నాయి. బ్యాంక్ ఉద్యోగం చేసుకునే స్థాయినుండి రైతులకు కోట్ల రూపాయిలు సాయంచేసే స్థాయికి ఎదిగిన అతడు వైట్ కాలర్ చీటర్ గా పోలీసులు పేర్కొంటున్నారు. తన బావమరిదిని ఎవరో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేయడంతో చక్రధర్ లోని కేటుగాడు సైతం మేల్కొన్నాడు. మోసపోయిన బామ్మర్దితోనే కలిసి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఏకంగా ఓ కాల్ సెంటర్ పెట్టిమరి యువతను మోసగించడం ప్రారంభించాడు. అయితే తెలంగాణలో ఈ మోసాలకు పాల్పడితే ఈజీగా దొరికిపోతాడని తెలిసి కేవలం ఇతర రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగ యువతనే చక్రధర్ టార్గెట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read More హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం.. 300 గ్రాముల కొకైన్ సీజ్.. అతడిని పట్టుకోవడంతో వెలుగులోకి..
ఇలా 2018లో హైదరాబాద్ లో కాల్ సెంటర్ ఏర్పాటుచేసి చక్రధర్ గౌడ్ వివిధ మార్గాల్లో నిరుద్యోగుల డేటా సేకరించాడు. తన కాల్ సెంటర్ ఉద్యోగులతో వారికి ఫోన్ చేయించి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించేవాడు. ఈ మాటలు నమ్మి డిపాజిట్లు చెల్లించాక ఫోన్ నెంబర్లు మార్చేస్తాడు. ఇలా ఒక్క నెలలోనే 50 నుండి 60 లక్షలు కాజేసేవాడంటేనే ఇప్పటివరకు ఎన్నికోట్లు పోగేసాడో అర్ధంచేసుకోవచ్చు.
యువతను మోసగించేందుకు ఇప్పటివరకు ఇతడు వెయ్యికి పైగా సిమ్ కార్డులను కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిరుద్యోగుల నుండి డిపాజిట్ల రూపంలో ఇప్పటివరకు వసూలు చేసిన మొత్తం రూ.50 కోట్ల వరకు వుంటాయని సమాచారం. ఇలా మోసం చేసి సంపాదించిన డబ్బును రైతుల కోసం ఖర్చుచేసి సమాజసేవ చేస్తున్నట్లు అందరినీ నమ్మించాడు చక్రధర్ గౌడ్. అతడు నిజంగామనే మంచిపనులు చేస్తున్నాడని భావించి ఓ జాతీయ పార్టీ చేర్చుకున్నారు.