రేపటి జగిత్యాల బంద్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు ఎస్ఐ అనిల్. తాను ఎలాంటి తప్పు చేయలేదని, పోలీస్ ఉన్నతాధికారులపై , చట్టంపై తనకు నమ్మకం వుందని ఆయన స్పష్టం చేశారు.
జగిత్యాల రూరల్ ఎస్సై అనిల్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ఇదే సమయంలో అనిల్ సస్సెన్షన్‌ను వ్యతిరేకిస్తూ విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రేపు జగిత్యాల బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో విషయం రాజకీయ రంగు పులుముకుంది. ఈ నేపథ్యంలో ఎస్ఐ అనిల్ స్పందించారు. బంద్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. కొందరు రాజకీయ నాయకులు, కొన్ని వర్గాలు వారి స్వ ప్రయోజనాల కోసమే బంద్ చేస్తున్నారని అనిల్ ఆరోపించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, పోలీస్ ఉన్నతాధికారులపై , చట్టంపై తనకు నమ్మకం వుందని ఆయన స్పష్టం చేశారు. తన సస్పెన్షన్ వ్యవహారాన్ని నిబంధనల ప్రకారం పరిష్కరించుకుంటానని అనిల్ తెలిపారు.
అంతకుముందు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ వ్యవహారంపై స్పందించారు. ఎలాంటి విచారణ లేకుండా ఎంఐఎం ఒత్తిళ్లకు తలొగ్గి అనిల్‌ను సస్పెండ్ చేశారని సంజయ్ ఆరోపించారు. ఆర్టీసీ బస్సు గొడవ ఘటనలో జగిత్యాల ఎస్ఐని సస్పెండ్ చేయడంతోపాటు ఆయన భార్యపైనా కేసులు నమోదు చేయడాన్ని బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. ఎస్సై అనిల్ సస్పెన్షన్‌ను నిరసిస్తూ రేపు జగిత్యాల బంద్ కు పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు. ఒక ఎస్ఐగా ఉన్న వ్యక్తి భార్య ఇద్దరు పసిపిల్లలతో ఎండా కాలం బస్సులో ప్రయాణిస్తోందంటేనే సదరు ఎస్ఐ ఎంతటి నిజాయితీపరుడో అర్ధం చేసుకోవాలన్నారు. సిగ్గులేకుండా ఆయనను సస్పెండ్ చేయడమే కాకుండా ఎస్ఐ, ఆయన భార్యపైన, కానిస్టేబుల్ పైనా కేసు పెట్టడం సిగ్గు చేటని సంజయ్ దుయ్యబట్టారు.
Also REad: జగిత్యాలలో ఎస్సై అనిల్ సస్పెన్షన్ .. అంతా ఎంఐఎం ఒత్తిడితోనే, పోలీస్ సంఘం ఏం చేస్తోంది: బండి సంజయ్
బురఖా వేసుకున్న మహిళ ఫిర్యాదు చేస్తే అదో పెద్ద నేరంగా చూసి సస్పెండ్ చేస్తారా అంటూ ఆయన ఫైర్ అయ్యారు. పోలీస్ స్టేషన్‌ను ముట్టడించే ప్రయత్నం చేస్తే కేసులు పెట్టి లోపలేయకుండా.. తిరిగి ఎస్ఐపైనే కేసులు పెట్టడం దుర్మార్గమని సంజయ్ మండిపడ్డారు. పోలీస్ సంఘం ఏం చేస్తోంది.. మీ సంఘ సభ్యుడికి ఇంత అన్యాయం జరుగుతుంటే నోరెందుకు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. తన ముందే భార్యను క్షోభకు గురిచేస్తుంటే ఆ ఎస్ఐ మానసిక వేదనను అర్ధం చేసుకోరా అని ఆయన నిలదీశారు. తక్షణమే ఎస్ఐ అనిల్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని.. కేసులను ఉపసంహరించుకోవాలని ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని సంజయ్ డిమాండ్ చేశారు.
జగిత్యాల సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మారిందని.. పీఎఫ్ఐ జిందాబాద్ అంటూ వాగుతున్నారని ఆయన విమర్శించారు. పోలీస్ స్టేషన్ పై దాడులు చేస్తున్నారని.. ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని, జగిత్యాలపై ప్రత్యేక దృష్టి పెడతామని వాళ్ల సంగతి చూస్తామని సంజయ్ హెచ్చరించారు.
