మూడేళ్ల బాలుడి హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు.. అన్న కళ్లెదుటే లైంగికదాడి, చిత్రహింసలు..!!
మూడేళ్ల బాలుడి హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. తల్లి, ప్రియుడు పథకం ప్రకారం చిన్నారిని హత్య చేశారు. హత్యకు ముందు చిన్నారిపై లైంగిక దాడి, చిత్రహింసలకు పాల్పడ్డారని తేలింది.
హైదరాబాద్ : అభం,శుభం తెలియని మూడేళ్ల చిన్నారికి నరకం చూపించాడో కిరాతకుడు.. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని.. ఆ చిన్నారి అన్నముందే పాశవికంగా వ్యవహరించాడు. లైంగికదాడి చేసి, మర్మాయవాల్లో రాడ్డు దూర్చి.. చిత్రహింసలకు గురిచేశాడు. దీనికి కన్నతల్లి సహకరించడం ఇక్కడ కొసమెరుపు. మూడు రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన మూడేళ్ల చిన్నారి మృతి కేసులో షాకింగ్ విషయాలు ఇవి. బాలుడు హత్యకు కారకులైన ముత్యాల రవి (34), పొన్నగంటి నాగలక్ష్మి (24)లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మంగళవారం పోలీసు స్టేషన్లో చిక్కడపల్లి ఏసీపీ ఎ.యాదగిరి, ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ ఇ జహంగీర్ యాదవ్ తో కలిసి నగర మధ్యమండలం డిసిపి రాజేష్ చంద్ర మీడియాకు వివరాలు వెల్లడించారు.
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారానికి చెందిన పొన్నగంటి శివకుమార్, నాగలక్ష్మి అలియాస్ లక్ష్మి దంపతులు. వీరికి 5,3 యేళ్ల కుమారులు ఉన్నారు. అదే జిల్లా పంగ్రా గ్రామవాసి ముస్తాల రవి కుటుంబంతో హైదరాబాద్ కు వచ్చి స్థిరపడ్డాడు. ఇతడికి నాగలక్ష్మితో పాత పరిచయం ఉంది. రెండు నెలల క్రితం భార్య గొడవపడి వెళ్లిపోవడంతో రవి తన మకాంను ఆ దంపతుల ఇంటికి మార్చాడు. అయితే, భర్త పనికి వెళ్లగానే వీరిద్దరూ ఏకాంతంగా గడిపేవారు. చిన్న కుమారుడు (3) అంగన్వాడికి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చేవాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న వీరిద్దరూ పిల్లాడిపై కోపం ప్రదర్శించేవారు.
గత నెల 8న ఉదయం చిన్న కుమారుడిని అంగన్వాడిలో వదిలేసి నాగలక్ష్మి హైటెక్ సిటీ వద్ద పని వెతుక్కుందామంటూ భర్తను తీసుకువెళ్ళింది. ఈ విషయం ముందుగానే ప్రియుడికి సమాచారం ఇచ్చింది. పథకం ప్రకారం మధ్యాహ్నం రవి ఇద్దరు పిల్లల్ని రామ్ నగర్ లోని ఇంటికి తీసుకువచ్చాడు. అప్పటికే మద్యంమత్తులో ఉన్న రవి మూడేళ్ల బాలుడిపై అసహజ పద్ధతిలో లైంగికదాడి చేశాడు. తర్వాత బాలుడు మలద్వారంలోకి పొడవైన ఇనుప చువ్వను దూర్చాడు. తలపై బలంగా కొట్టి తీవ్రంగా గాయపరిచాడు.
బాలుడు అపస్మారక స్థితికి చేరగానే ఒంటిపై దుస్తులు మార్చి ఆధారాలు లేకుండా చేశాడు. తర్వాత భార్య భర్తలకు ఫోన్ చేసి బాలుడు కుర్చీ మీదినుంచి కింద పడటంతో తలకు తీవ్ర గాయమైందని సమాచారం అందించాడు. వారు వచ్చి వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. ప్రమాదవశాత్తు మరణించినట్లు మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాలుడి శరీరంపై గాయాలు, మలద్వారం వద్ద రక్తస్రావం, అంతర్గత అవయవాలు దెబ్బతినటం కారణంగా బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
బాలుడి గాయాలు... కుర్చీ పైనుంచి కింద పడితే తగిలిన దెబ్బలు కావని గాంధీ వైద్యులు, ముషీరాబాద్ పోలీసులు అనుమానించారు. ఘటన జరిగిన తర్వాత నాగలక్ష్మి, రవి రెండు రోజులు మాయమైనట్లు గుర్తించారు. మూడు రోజుల క్రితం పోలీసులకు అందిన పోస్టుమార్టం నివేదికలో అంతర్గత అవయవాలు దెబ్బతిని.. లోపల రక్తస్రావం జరగటమే మరణానికి కారణం అని నిర్ధారించారు. నిందితులను అదుపులోకి తీసుకుని వాస్తవాలు రాబట్టారు.