శాతవాహన విద్యార్థులకు షాకింగ్ న్యూస్

First Published 25, Dec 2017, 7:28 PM IST
shocking news for satavahana university students
Highlights
  • శాతవాహన విద్యార్థులకు చేదు కబురు
  • హాస్టళ్లు మూసివేసిన యూనివర్శిటీ
  • లబోదిబోమంటున్న స్టూడెంట్స్

కరీంనగర్ లోని శాతవాహన యూనివర్శిటీ విద్యార్థులకు ఇది షాకింగ్ న్యూస్. యూనివర్శిటీలో ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల మధ్య రాళ్ల దాడి జరగడంతో పోలీసులు క్యాంపస్ లోకి ఎంట్రీ అయ్యారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు.

అయితే సుమారు 100 మందికి పైగా విద్యార్థులను అరెస్టు చేశారు. అయినా పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా ఉండడంతో అత్యవసరంగా హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని తీసుకున్నది యాజమాన్యం. విద్యార్థులంతా హాస్టళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు. హాస్టళ్ల మూసివేత తక్షణమే అమలులోకి వచ్చినట్లు యూనివర్శిటీ యాజమాన్యం ప్రకటించింది. దీంతో పోలీసులు హాస్టళ్లను ఖాళీ చేయిస్తున్నారు.

వివాదాస్పద మనుధర్మ శాస్త్రం పుస్తకాన్ని ఒక వర్గం విద్యార్థి సంఘాల నాయకులు తగలబెట్టారన్నదానిపై వివాదం నెలకొంది. భారత మాత పటాన్ని తగలబెట్టారని మరో విద్యార్థి సంఘం ఆరోపించింది. దీంతో ఇరు వర్గాల వారు రాళ్ల వర్షం కురిపించుకున్నారు. కేవలం మనుధర్మ శాస్త్రం పుస్తకాన్ని తగులబెట్టారా? ఇంకేదైనా జరిగిందా అన్నది తెలియాల్సి ఉంది.

కరీంనగర్ పోలీసు కమిషనర్ కమలాసన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి ఆందోళనకారును అదుపుచేసే ప్రయత్నం చేశారు.

విద్యార్థుల మధ్య గొడవల కారణంగా శాతవాహన యూనివర్శిటీ ప్రాంగణంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. యూనివర్శిటీ మొత్తం పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కేవలం కొద్దిమంది ఆందోళనల కారణంగా యూనివర్శిటీలో చదువుతున్న యావన్మంది విద్యార్థులను బయటకు వెళ్లగొట్టడం పట్ల విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. చిన్న సమస్యను కంట్రోల్ చేసేందుకు మాకు పెద్ద శిక్ష వేస్తారా అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

loader