60వ పుట్టినరోజును అందరూ పెద్ద పండగలా చేసుకుంటారు. అయితే అపోలో ఆస్పత్రుల వైస్‌ చైర్‌పర్సన్‌ శోభనా కామినేని తన 60వ పుట్టినరోజు వేడుకను మరింత వినూత్నంగా జరుపుకున్నారు. తన పుట్టిన రోజును ఆరోగ్య పండుగగా చేసుకున్నారామె.

ఈ నెల 25న ఉదయం తన భర్త అనిల్‌ కామినేనితో కలసి చాలెంజ్‌ టు సైకిల్‌ టు చెన్నై ఫ్రం హైదరాబాద్‌ అనే నినాదాన్ని ఎంచుకొని బయల్దేరారు. రోజుకు వంద కిలోమీటర్లు సైక్లింగ్‌ చేస్తూ ఆరు రోజుల్లో 600 కిలోమీటర్లు వెళ్ళి చెన్నైలో తన తండ్రి ప్రతాప్‌.సి.రెడ్డిని బుధవారం కలుసుకొని సంతోషం పంచుకున్నారు. 

సైక్లింగ్‌తో తన భర్త, కూతురుతో కలసి ఔటింగ్‌కు వెళ్లిన ఆనందం కలిగించిందని ఆమె తెలియజేశారు. సైకిల్‌ రైడింగ్‌ తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా ఒక మహిళ తలచుకుంటే ఏదైనా సాధించగలదనే నమ్మకానికి పునాది వేసిందని పేర్కొన్నారు. 

తన తల్లి శోభనా కామినేని తన 60వ పుట్టినరోజున హైదరాబాద్‌ నుంచి చెన్నైకి 600 కిలోమీటర్లు సైకిల్‌ రైడింగ్‌ చేస్తూ వెళ్లడం తనకెంతో గర్వంగా ఉందని ఆమె కూతురు, సినీహీరో రామ్‌చరణ్‌ తేజ్‌ సతీమణి ఉపాసన కొణిదెల బుధవారం ట్విట్టర్‌ వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు.