హైదరాబాద్:  హైద్రాబాద్ ఎల్బీనగర్ ఆసుపత్రిలో ఓ చిన్నారి మృతికి కారణమైన షైన్ ఆసుపత్రిని సోమవారం నాడు సీజ్ చేశారు.

సోమవారం నాడు తెల్లవారుజామున  షైన్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొని ఓ చిన్నారి మృతి చెందాడు. మరో ఆరుగురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఆరుగురు చిన్నారులను ఇతర ఆసుపత్రులకు పంపారు.  ఆయా ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

షైన్ ఆసుపత్రిలో ఫైర్ సేఫ్టీ లైసెన్స్ ను ఆసుపత్రి యాజమాన్యం రెన్యూవల్ చేయలేదని అగ్నిమాపక సిబ్బంది సోమవారం నాడు గుర్తించారు. సోమవారం నాడు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో  గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. మంటల కారణంగా దట్టంగా పోగలు వ్యాపించాయి.ఈ ఘటనలో చిన్నారి మృతి చెందగా, మరో ఆరుగురు చిన్నారులు ప్రాణాపాయస్థితిలో ఉన్నారు.

చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న షైన్ ఆసుపత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆసుపత్రిలో కనీస ప్రమాణాలు కూడ పాటించడం లేదని పిల్లల తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు.

ఆసుపత్రిలోని ఐసీయూలో ఉన్న చిన్నారులను అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వచ్చిన తర్వాతే అక్కడి నుండి తరలించారు. అప్పటివరకు ఆ చిన్నారులు మంటలతో వచ్చిన పొగతో ఉక్కిరి బిక్కిరయ్యారు. ఈ పొగ కారణంగానే ఓ చిన్నారి మృతి చెందినట్టుగా అన్నిమాపక సిబ్బంది చెప్పారు. మరో వైపు పిల్లల కులుంబసభ్యులను ఆసుపత్రిలో పై అంతస్థుకు వెళ్లకుండా ఆసుపత్రి వర్గాలు అడ్డుకొన్నాయని పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

షైన్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం: చిన్నారి మృతి, మరో ఆరుగురి పరిస్థితి విషమం

ఆగ్నిప్రమాదం చోటు చేసుకొన్న సమయంలో  చిన్నారులను వెంటనే  ఐసీయూ నుండి బయటకు తీసుకొని వస్తే ఇంత ప్రమాదం జరిగేది కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. 

నియమ నిబంధనలకు విరుద్దంగా ఆసుపత్రిని నడుపుతున్న షైన్ ఆసుపత్రిని సోమవారం నాడు ఉదయం సీజ్ చేశారు. ఈ ఆసుపత్రిపై కేసు నమోదు చేశారు. అగ్ని ప్రమాదానికి  షార్ట్ సర్క్యూట్ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.