వీధికుక్కల దాడిలో భారీగా గొర్రెలు మృతిచెంది రైతుకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. 

సిరిసిల్ల : గొర్రెల మందపై వీధికుక్కలు దాడిచేసిన ఘటనలో 33 గొర్రెలు మృతిచెందాయి. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిట్టవేని నర్సయ్యకు చెందిన గొర్రెలమందపై కుక్కలు దాడిచేసాయి. ఈ ఘటనలో నర్సయ్యకు మూడున్నర లక్షల నష్టం వాటిల్లినట్లు సమాచారం. 

వీధికుక్కలు ఒక్కసారిగా గొర్లమందపై పడి దొరికిన గొర్రెను దొరికినట్లు దాడి చేసాయి. గొర్రెల అరుపులు విని కాపరి వెళ్లేసరికే చాలా గొర్లు చనిపోయి పడివున్నాయి.దాడికి దిగిన కుక్కలను తరిమేసి మిగతా గొర్లను కాపాడుకున్నాడు యజమాని నర్సయ్య. కుక్కల దాడిలో తీవ్రంగా నష్టపోయిన అతడికి ప్రభుత్వమే ఆదుకోవాలని యాదవ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

ఇదిలావుంటే గ్రామాలు, పట్టణాల్లో వీధికుక్కల స్వైరవిహారం చేస్తున్నారు. పాడిపశువులు, మేకలు, గొర్రెలపైనే కాదు మనుషులపైనా దాడికి పాల్పడుతూ భయోత్పాతం సృష్టిస్తున్నాయి.ఇటీవల హైదరాబాద్ అంబర్ పేటలో ముక్కపచ్చలారని బాలుడిపై కుక్కుల దాడిచేసి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించగా అధికారులు కుక్కలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు. అయినప్పటికి వీధికుక్కల దాడులు ఆగడం లేదు. 

Read More ఆహారం పెట్టడానికి వచ్చిన మహిళ మీద కుక్కల దాడి.. అక్కడికక్కడే మృతి..

ఇటీవల నిర్మల్ జిల్లా కడెం మండలం అంబరిపేట గ్రామంలో కొండవేని కొమకయ్యకు చెందిన గొర్ల మందపై కుక్కలు దాడిచేసాయి. ఈ దాడిలో 25 గొర్రెలు చనిపోయివడంతో రైతుకు తీవ్రంగా నష్టపోయాడు. 

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రొడ్డ సురేష్ కు గొర్లమందపై కుక్కలు దాడిచేసి 25 గొర్లను అతి దారుణం చంపేసాయి. దీంతో సుమారు లక్షన్నర వరకు అతడికి నష్టం వాటిల్లింది. 

బిఆర్ఎస్ ప్రభుత్వం గొల్లకుర్మలకు గొర్లను పంపిణీ చేస్తుండటంతో గ్రామాల్లో వాటిసంఖ్య పెరిగిపోయింది. ఇదే క్రమంలో గ్రామాల్లో వీధికుక్కలు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో ఆహారం కోసం కుక్కుల గొర్ల మందలపై పడుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.