మునుగోడు ఉపఎన్నిక వేళ.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆకస్మిక పరిణామం చోటుచేసుకుంది. గొర్రెల పంపిణీ పథకాన్ని నగదు బదిలీకి మారుస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. 

మునుగోడు ఉపఎన్నిక వేళ.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆకస్మిక పరిణామం చోటుచేసుకుంది. గొర్రెల పంపిణీ పథకాన్ని నగదు బదిలీకి మారుస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం.. నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలో లబ్దిదారులకు గొర్రెల పంపిణీకి బదులు.. నగదు బదిలీ చేపట్టనుంది. ఇందుకు సంబంధించి అక్టోబర్ 1వ తేదీనే సర్కార్ ఈ ఉత్తర్వులను జారీ చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెల కొనుగోళ్లకు సమయం పడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. గొర్రెల పంపిణీలో జాప్యాన్ని నివారించడానికి.. గొల్ల/కురుమ సంఘం సభ్యులు సొంతంగా గొర్రెలను కొనుగోలు చేసేలా ప్రత్యక్ష నగదు ప్రయోజన పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నాయి. అయితే రెండు జిల్లాలను పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ.. పైలట్ ప్రాజెక్టు కింద మునుగోడు నియోజకవర్గాన్ని ఎంపిక చేసింది.

రెండో విడత గొర్రెల పంపిణీ పథకానికి ఎంపికైన లబ్దిదారులకు.. సబ్సిడీ మొత్తాన్ని బదిలీ చేయాలని నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో నల్గొండ జిల్లాలో 5,600 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2,000 మంది లబ్ధిదారులకు మొత్తం 93.76 కోట్ల రూపాయల నగదు ప్రయోజనం పొందనున్నారు. అయితే మొత్తం 7,600 మంది లబ్దిదారులు కూడా మునుగోడు నియోజకవర్గానికి చెందినవారే. యాద్రాద్రి జిల్లాలోని చౌటప్పుల్, నారాయణపురం మండలాల్లో 2 వేల మంది.. నల్గొండ జిల్లాలోని మునుగోడు, చండూరు, నాంపల్లి, మర్రిగూడ, గట్టుప్పల్ మండలాల్లో 5,600 మంది లబ్దిదారులు ఉన్నారు. 

గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా ప్రభుత్వం రూ.1.75 లక్షలతో.. ఒక్కో లబ్ధిదారునికి 20 గొర్రెలు, ఒక పొట్టేలును పంపిణీ చేస్తున్నసంగతి తెలిసిందే. ఇందులో లబ్ధిదారుడు 25 శాతం లేదా రూ.43,750 జమ చేయాల్సి ఉండగా.. ప్రభుత్వం రూ.1,31,250 జమ చేస్తుంది. ఇప్పుడు గొర్రెల పంపిణీ పథకాన్ని నగదు బదిలీగా మార్చిన నేపథ్యంలో.. ప్రభుత్వం తన వాటా రూ. 1,31,250 నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు బదిలీ చేస్తుంది. ఈ మొత్తాన్ని ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు బదిలీ చేసింది.

అయితే అక్టోబర్ 7 మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడనుండగా.. నవంబర్ 3న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నిక కోసమే రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని.. నగదు బదిలీకి మార్చిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఆగమేఘాలపై ఆర్డర్స్ జారీ చేసిందనే పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

ఇక, ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఈనెల 7న మునుగోడు ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల సమర్పణకు ఈనెల 14వరకు తుది గడవుగా నిర్ణయించారు. ఈ నెల 15న నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 17 వరకు అవకాశం కల్పించారు. ఇక, నవంబర్ 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 6వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.