జాతీయ రాజకీయాలు: కేసీఆర్‌తో గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా భేటీ
తెలంగాణ సీఎం కేసీఆర్ తో గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా శుక్రవారం నాడు భేటీ అయ్యారు.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ తో గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా శుక్రవారం నాడు భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ భావిస్తున్న తరుణంలో గుజరాత్ మాజీ సీఎం వాఘేలా కేసీఆర్ తో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా ఇటీవలనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. త్వరలో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో శంకర్ సింగ్ వాఘేలా తన పార్టీ తరపున అభ్యర్ధులను బరిలోకి దింపనున్నారు. రాష్ట్రంలోని 182 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్ధులను బరిలోకి దింపుతామని శంకర్ సింగ్ వాఘేలా ప్రకటించారు.
2024 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని కేసీఆర్ ప్రకటించారు. బీజేపీ ముక్త్ భారత్ దిశగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెబుతున్నారు.ఈ తరుణంలో బీజేపీయేతర పార్టీల నేతలు, సీఎంలను కేసీఆర్ కలుస్తున్నారు. గతంలోనే బీహర్, బెంగాల్, కేరళ, తమిళనాడు, రాష్ట్రాల సీఎంలతో కేసీఆర్ భేటీ అయ్యారు. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీల నేతలతో కూడా కేసీఆర్ చర్చలు జరిపారు
గత ఆదివారం నాడు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి హైద్రాబాద్ లో కేసీఆర్ తో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో జాతీయ రాజకీయాలపై చర్చించారు. దసరా లోపుగానే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని కుమారస్వామి ప్రకటించారు. కేసీఆర్ తో భేటీ ముగిసిన తర్వాత కుమారస్వామి ఈ విషయాన్ని ప్రకటించారు.
వచ్చే నెలలో విజయవాడలో జరిగే సీపీఐ జాతీయ మహసభల్లో బీజేపీ, కాంగ్రెసేతర పార్టీల నేతలతో సీపీఐ నేతలు సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.ఈ సమావేశానికి కేసీఆర్ కు కూడ సీపీఐ నేతలు ఆహ్వనం పలికారు. 2024 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా నిలువరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు పార్టీల నేతలతో కేసీఆర్ చర్చిస్తున్నారు. ఈ చర్చల్లో భాగంగానే గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలాతో కేసీఆర్ ఇవాళ చర్చిస్తున్నారు.