మహబూబాబాద్ శంకర్ నాయక్ ఔట్ ?

shankar naik likely to be shown door in favour of redya naiks daughter in mahabubabad
Highlights

  • మీడియాతో రెడ్యా నాయక్ చిట్ చాట్
  • వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబానికి రెండు సీట్లు 
  • ఎంపిగా పోటీ చేసే ప్రసక్తే లేదు
  • మళ్లీ కాంగ్రెస్ లోకి వెళ్లేది లేదు

మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు వచ్చే ఎన్నికల్లో టికెట్ గల్లంతయ్యే ప్రమాదముందా? ఆయన స్థానంలో మరొకరికి టికెట్ ఇస్తామని సిఎం కేసిఆర్ హామీ ఇచ్చారా? మరి వేరొకరికి ఆ సీటు ఇస్తే శంకర్ నాయక్ ఎక్కడ పోటీ చేస్తారు? ఒకవేళ శంకర్ నాయక్ కు టిఆర్ఎస్ టికెట్ రాకపోతే పార్టీలో ఉంటారా? ఉండరా? ప్రస్తుతం వరంగల్ రాజకీయాల్లో ఈ అంశాలపై హాట్ హాట్ చర్చలు సాగుతున్నాయి.

తెలంగాణలో తన ప్రవర్తన కారణంగా వార్తల్లోకి ఎక్కిన అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో శంకర్ నాయక్ ఒకరు. ఆయన మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతిమీనా పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు, ఆమె చేయి పట్టుకున్నట్లు ఆరోపణలు ఎదురొన్నారు. తర్వాత శంకర్ నాయక్ వ్యవహారిక తీరు పట్ల రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేగింది. కలెక్టర్ కేసు పెట్టారు కూడా. ప్రస్తుతం శంకర్ నాయక్ మీద కేసు కొనసాగుతూ ఉన్నది.

అయితే కలెక్టర్ తో వివాదం నేపథ్యంలో అప్పట్లో శంకర్ నాయక్ ను సిఎం కేసిఆర్ కూడా మందలించారు. కానీ ఆ వివాదం ఇంకా శంకర్ నాయక్ మెడకు వేలాడుతున్న కత్తి మాదిరిగా ఉంది. ఎందుకంటే ఆయనపై కేసు ఇంకా కంటిన్యూ కావడమే దీనికి కారణం. కలెక్టర్ వివాదం విషయంలో శంకర్ నాయక్ ను అరెస్టు చేస్తారని, ఆయనను టిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని జోరుగా ప్రచారం సాగింది. కానీ తుదకు సిఎం కేసిఆర్ మందలించి వదిలేశారు. కథ మాత్రం సుఖాంతం కాలేదు. ఏ క్షణంలోనైనా ఆ కేసు మళ్లీ బయటకొచ్చే చాన్స్ కూడా ఉందంటున్నారు.

ఇక ఈ పరిణామాలు ఇలా ఉంటే.. శంకర్ నాయక్ కు మహబూబాబాద్ టికెట్ గల్లంతవుడు ఖాయమని బాంబు పేల్చారు మాజీ మంత్రి రెడ్యానాయక్. వచ్చే 2019 ఎన్నికల్లో తమ కుటుంబానికి రెండు సీట్లు గ్యారెంటీగా ఇస్తానని సిఎం కేసిఆర్ మాట ఇచ్చారని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో పలు అంశాలపై ముచ్చటించారు. సిఎం మాట ఇచ్చినారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో తనకు, తన కూతురు కవితకు రెండు అసెంబ్లీ స్థానాలు వస్తాయన్న ధీమా ఉందన్నారు. తాను డోర్నకల్ నుంచి తన కూతురు కవిత మహబూబాబాద్ నుంచి పోటీ చేస్తామని స్పష్టం చేశారు.

తాను ఎంపిగా పోటీ చేస్తానని చెబుతున్న మాటల్లో ఏమాత్రం నిజం లేదని చెప్పారు రెడ్యానాయక్. తాను ఎమ్మెల్యేగానే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని, ఎంపిగా చేయబోనని స్ఫస్టం చేశారు. ఈ పరిస్థితుల్లో మహబూబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్నకు రెడ్యా నాయక్ స్పందిస్తూ ఆయనను ఎక్కడ అడ్జెస్ట్ చేస్తారో సీఎం కు మాత్రమే తెలుసు అన్నారు. తమ కుటుంబం తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్లే ఆలోచన చేయడంలేదని స్పష్టం చేశారు. ఆ విషయంలో తమ ఫ్యామిలీని సంప్రదించే దమ్ము ఎవరికీ లేదన్నారు రెడ్యా నాయక్.

మొత్తానికి శంకర్ నాయక్ టికెట్ వచ్చే ఎన్నికల్లో కష్టమే అన్న భావన వ్యక్తం చేశారు రెడ్యానాయక్.

loader