హైదరాబాద్: లక్షా 20 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన షాబాద్ ఇన్ స్పెక్టర్ శంకరయ్య విషయంలో దిగ్బ్రాంతికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. లంచం తీసుకుంటూ శంకరయ్యతో పాటు ఎఎస్ఐ రాజేందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వారికి కరోనా పరీక్షలతో పాటు ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి ఏసీబీ కోర్టు ముందు ప్రవేశపెట్టారు. 

ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు వారిద్దరిని ఏసీబీ అధికారులు హైదరాబాదులోని చంచల్ గుడా జైలుకు తరలించారు. శంకరయ్య కేసులో ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. శంకరయ్య ఇళ్లలోనే కాకుండా ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పలు విలువైన పత్రాలను వారు స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల్లో విస్తుపోయే విలువైన ఆస్తుల వివరాలు బయటపడ్డాయి.

Also Read: ఇంద్ర భవనాన్ని తలపించే ఇల్లు, 20 కోట్ల ఆస్తులు: షాబాద్ సీఐ ఇంట్లో ఏసీబీ తనిఖీలు

శంకరయ్య అస్తుల విలువ మార్కెట్ ధరల ప్రకారం 40 కోట్ల రూపాయలపైనే ఉంటుందని భావిస్తున్నారు. నిజామాబాద్, మిర్యాలగూడ, చేవెళ్ల ప్రాంతాల్లో 41 వేల ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు గుర్తించారు. వాటి విలువ 77 లక్షల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా వేశారు. ఇంద్రభవనాలను తలపించే రెండు ఇళ్లు ఆయనకు ఉన్నాయి. అంతేకాకుండా హైదరాబాదులోనూ, చుట్టుపక్కల 11 ప్లాట్స్ ఉన్నట్లు గుర్తించారు. భారీగా బంగారం, ఇళ్ల స్థలాలు, ఉన్నట్లు ఏసీబీ అధికారులు గర్తించారు. తవ్వుతున్న కొద్దీ విస్తుపోయే విషయాలు శంకరయ్య కేసులో బయటపడుతున్నాయి.

శంకరయ్య అస్తుల చిట్టా విప్పుతుంటే మరో విస్తుపోయే విషయం బయటపడింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వ్యాపారి చిగురుపాటి జయరామ్ హత్య కేసులో ఆయన పాత్ర వెలుగు చూసింది. జయరామ్ హత్య కేసులో నిందితులకు ఆయన పలు రకాలుగా సహకరించినట్లు తెలుస్తోంది. జయరామ్, శిఖా చౌదరి కాల్ రికార్డులు రాకేష్ రెడ్డికి అందించడంలో శంకరయ్య సహకరించినట్లు తెలుస్తోంది. 

Also Read: చిగురుపాటి జయరామ్ హత్యతో శిఖాచౌదరికి ఎలాంటి సంబంధం లేదు: పోలీసులు

జయరామ్ హత్య కేసులో నిందితుడు రాకేష్ రెడ్డికి శంకరయ్య సహకరించినట్లు దర్యాప్తులో తేలింది. దుండిగల్ ఇన్ స్పెక్టర్ గా ఉన్నప్పుడు రాకేష్ రెడ్డికి ల్యాండ్ సెటిల్ మెంట్ల చేసేందుకు సాయపడినట్లు తెలుస్తోంది.