భూతగాదా కేసులో రూ.1.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయిన  షాబాద్ ఇన్స్‌పెక్టర్ శంకరయ్యపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. శుక్రవారం ఉదయం నుంచి శంకరయ్య ఆస్తులపై సోదాలు నిర్వహించిన ఏసీబీ కోట్లాది రూపాయల ఆస్తులు గుర్తించింది.

ఇక శంకరయ్య ఇల్లు ఇంద్ర భవనాన్ని తలపిస్తోంది. మూడంతస్తుల భవనం మొత్తానికి ఏసీ, పార్కింగ్ నుంచి బాత్రూం వరకు మార్బుల్స్, 7 స్టార్ హోటల్ రేంజ్‌లో సౌకర్యాలను సమకూర్చుకున్నారు.

ఇల్లు కాకుండా హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో ఆస్తులున్నట్లు ఏసీబీ సోదాల్లో తేలింది. భవనాలు, పొలాలకు సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మొత్తం 11 చోట్ల ప్లాట్లతో పాటు రూ.20 కోట్ల ఆస్తులున్నట్లు వారు గుర్తించారు. హైదరాబాద్‌లో రెండు చోట్ల అపార్ట్‌మెంట్లతో పాటు నల్గొండ జిల్లా మోతెలో భారీగా వ్యవసాయ భూములు కొనడంతో పాటు కుటుంబసభ్యుల పేరుతో బినామీ ఆస్తులు సేకరించారు.

కాగా షాబాద్ మండల పరిధిలోని చిన్న సోలిపేట్‌కు చెందిన ఓ రైతుకు భూవివాదంలో సాయం చేస్తామంటూ సీఐ శంకరయ్య, ఏఎస్ఐ రాజేందర్ తమకు డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇందుకోసం వీరి మధ్య రూ.1.20 లక్షలకు ఒప్పందం కుదిరింది. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం.. సదరు రైతు సీఐకి లంచం ఇచ్చేందుకు వెళ్లాడు. ఆ వెంటనే ఏసీబీ అధికారులు వలపన్ని డబ్బును స్వాధీనం చేసుకుని సీఐ, ఏఎస్ఐని అదుపులోకి తీసుకున్నారు.