హైదరాబాద్: భూమి వివాదంలో రూ.1.2 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన షాబాద్ సీఐ శంకరయ్య ఆస్తుల జాబితా చూస్తే దిమ్మతిరగాల్సిందే. ఆయన కూడబెట్టిన ఆస్తులు ఒక్కటొక్కటే బయపడుతున్నాయి. కోట్లాది రూపాయల లావాదేలీలను ఆయన నెట్ క్యాష్ ద్వారానే జరిపినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. 

హైదరాబాదు శివారులో ఓ ఖరీదైన విల్లా కొనుగోలుకు శంకరయ్య అడ్వాన్స్ గా రూ.1.1 కోట్లు నగదు రూపంలో చెల్లించినట్లు తేలింది. దానికి సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వనస్థలిపురంలో 260 గజాల్లో నిర్మించిన జీ ప్లస్ టూ, పెంట్ హౌస్ కోసం కూడా నగదు రూపంలోనే డబ్బులు చెల్లించిట్లు తెలిసింది. అంత పెద్ద మొత్తంలో ఆయనకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read: సీఐ శంకరయ్య కేసులో షాకింగ్ నిజాలు: చిగురుబాటి హత్య కేసులోనూ...

అంతేకాకుండా శంకరయ్య స్టోన్ క్రషర్ వ్యాపారంలో పెద్ద యెత్తున పెట్టుబడులు పెట్టినట్లు వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన పత్రాలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆయనకు మొత్తం ఆరు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నట్లు తేలింది. ఆ ఖాతాల లావాదేవీల వివరాలు ఇవ్వాలని ఎసీబీ అధికారులు బ్యాంకులకు లేఖలు రాశారు. 

బ్యాంకుల నుంచి ఒకటి రెండు రోజుల్లో సమాచారం రావచ్చునని భావిస్తన్నారు. హైదరాబాదులోని ఓ బ్యాంకులోనే కాకుండా ఆయన గతంలో పనిచేసిన జిల్లాల్లో ఐదు ఖాతాలు ఉన్నట్లు గుర్తించారు. శంకరయ్యకు బ్యాంకు లాకర్లు ఉన్నాయా అనే కోణంలో ఏసీబి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకుల నుంచి అందే సమాచారం మేరకు ఏసీబి అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారు. 

Also Read: ఇంద్ర భవనాన్ని తలపించే ఇల్లు, 20 కోట్ల ఆస్తులు: షాబాద్ సీఐ ఇంట్లో ఏసీబీ తనిఖీలు

ట్రాప్ కేసుల పట్టుబడిన శంకరయ్యకు సంబంధించి ప్రాథమిక సోదాల్లో రూ.4.58 కోట్లు విలువైన స్థిర, చరాస్థులు ఏసీబీకి చిక్కాయి. రూ.1.5 కోట్ల విలువ చేసే రెండు ఇళ్లు, రూ.2.28 కోట్ల విలువ చేసే 11 ఇళ్ల స్థలాలు బయటపడ్డాయి. నిజామాబాద్ జిల్లా రెంజల్, చేవెళ్ల మండలం ముదిమ్యాల, మిర్యాలగుడాల్లో 41 ఎకరాల 3 గుంటల వ్యవసాయ భూమి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

రూ.21.14 లక్షల విలువైన బంగారు నగలు, రూ.17.88 లక్షల నగదును ఏసీబి అధికారులు గుర్తించారు. వాటితో పాటు వెండి అభరణాలు, ఇతర విలువైన గృహోపకరణాలను ఏసీబి అధికారులు గుర్తించారు.