దేశమంతా కూడా తెలంగాణ తరహా పరిస్థితి రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆకాంక్షించారు. పరిష్కారం లేని సమస్యలు ఉండవని.. గెలుపుకోసం కృషి చేయాల్సి ఉంటుందని అన్నారు.

హైదరాబాద్‌: దేశమంతా కూడా తెలంగాణ తరహా పరిస్థితి రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆకాంక్షించారు. దేశంలో రైతు సంఘ‌టిత శ‌క్తిని ఏకం చేద్దామని పిలుపునిచ్చారు. మ‌హారాష్ట్ర షెట్కారీ సంఘ‌ట‌న్ రైతు నేత శ‌ర‌ద్ జోషితో పలువురు నేతలు తెలంగాణ భవన్‌లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో అటు పోట్లు చూశానని చెప్పారు. తన రాజకీయ జీవితమమంతా పోరాటలేనని అన్నారు. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లేకుండా ఉండదని అన్నారు. 

పరిష్కారం లేని సమస్యలు ఉండవని.. గెలుపుకోసం కృషి చేయాల్సి ఉంటుందని కేసీఆర్ అన్నారు. రైతుల పోరాటం న్యాయమైనదని అన్నారు. గెలవాలంటే చిత్తశుద్దితో ఉండాలి.. తలచుకుంటే ఏదైనా సాధ్యమేనని చెప్పారు. రైతుల పోరాటంపై ప్రధాని మోదీ కనీసం సానుభూతి చూపలేదని విమర్శించారు. రైతులను ఖలీస్తానీలు, ఉగ్రవాదులు, వేర్పాటువాదులు అంటూ నిందలు వేశారని మండిపడ్డారు. 750 మంది రైతులు చనిపోతే మోదీ స్పందించలేదని అన్నారు. ఉత్తరప్రదేశ్‌, పంజాబ్ ఎన్నికలు లేకుంటే 3 నల్లా చట్టాలను రద్దు చేసేవారు కాదని విమర్శించారు. ఆ ఎన్నికల కోసమే ప్రధాని మోదీ తియ్యటి మాటలు చెప్పారని అన్నారు. రైతుల పోరాటం వల్లే కేంద్రం 3 నల్లా చట్టాలను రద్దు చేసిందని అన్నారు. 

తెలంగాణ వచ్చాక ఇక్కడ రైతుల సమస్యలను పరిష్కరించుకున్నామని చెప్పారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు పూర్తిగా తగ్గిపోయాయని చెప్పారు. తెలంగాణ‌లో ఏం చేశామో మీరంతా ఒక‌సారి చూడాలని మహారాష్ట్ర నేతలతో అన్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టును సంద‌ర్శించాలని సూచించారు. దేశం అంతా తెలంగాణ తరహా పరిస్థితి రావాలని ఆకాంక్షించారు. రైతులు ఇంకా ఎంతకాలం గిట్టుబాటు ధర కోసం పోరాడాలని ప్రశ్నించారు. ఒకప్పుడు సింగపూర్ ఎలా ఉండేది..? ఇప్పుడు ఎలా ఉంది? అని అన్నారు. ఏ వనరులు లేని సింగపూర్ అంత అభివృద్ది చెందినప్పుడు.. అన్ని వనరులు ఉన్నా భారతదేశం ఎందుకు అభివృద్ది చెందదని ప్రశ్నించారు. 14 మంది ప్రధానమంత్రులు మారినా మనదేశ తలరాత మారలేదని అన్నారు.