సీరియల్ కిల్లర్: మత్తులోకి దించి 16 మంది మహిళలను చంపాడు
మహిళలను లక్ష్యం చేసుకుని నగల కోసం ఇప్పటి వరకు 16 మందిని చంపిన ఎరుకల శ్రీనును మహబూబ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. అలివేలమ్మ అనే మహిళ హత్య కేసులో అతను పోలీసులకు చిక్కాడు.
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా పోలీసులు ఓ సీరియల్ కిల్లర్ ను అరెస్టు చేశారు. ఒంటిపై ఉన్న బంగారం, ఇతర నగల కోసం అతను 16 మంది మహిళలను హత్య చేశాడు. తన తమ్ముడిని కూడా చంపేశాడు. ఇటీవల ఓ మహిళ హత్య కేసులో అతను పోలీసులకు చిక్కాడు. అతన్ని మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం గుండేడ్ గ్రామానికి చెందిన ఎరుకల శ్రీనుగా పోలీసులు గుర్తించారు.
వివరాలు ఇలా ఉన్నాయి..... మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరు సివారులోని నవాబుపేట మండలం కూచురు గ్రామానికి చెందిన అలివేలమ్మ (53) శవాన్ని ఈ నెల 17వ తేదీన పోలీసులు గుర్తించారు. క్లూస్ టీమ్ సమాచారంతో ఆమె హత్యకు గురైనట్లు గుర్తించిన పోలీసులు ఎరుకల శ్రీను పాత్రను అనుమానించారు.
ఎరుకల శ్రీనును అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. దాంతో అతను నేరాన్ని అంగీకరించాడు. 2018 ఆగస్టులో జైలు నుంచి విడుదలైన తర్వాత 4 హత్యలు చేసినట్లు చెప్పాడు. మిడ్జిల్, భూత్పూర్, దేవరకద్ర, కొత్తకోట పోలీసు స్టేషన్ల పరిధిలో ఈ హత్యలు చేశాడు.
ఇటీవవల అబ్దుల్లాపూర్ మెట్ లో టీఎస్ఎండీసీ ఇసుక యార్డులో ఓ మహిళ ఎముకల గూడు బయటపడింది. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తవాగు సహా ఇతర ప్రాంతాల నుంచి ఆ ఇసుకను రవాణా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ హత్యను కూడా ఎరుకల శ్రీనే చేశాడని పోలీసులు గుర్తించారు.
ఎరుకల శ్రీను 2007లో తన తమ్ముడిని హత్య చేసి జైలుకు వెళ్లాడు. పరివర్తన కింద అప్పీల్ చేసుకుని మూడేళ్లలో జైలు నుంచి విడుదలయ్యాడు. ఆ తర్వాత కూడా పలు కేసుల్లో జైలుకు వెళ్లాడు. బయటకు వచ్చిన తర్వాత మిగతా హత్యలు చేసినట్లు భావిస్తున్నారు.
ఎరుకల శ్రీను షాద్ నగర్, శంషాబాద్ పరిధుల్లో మహిళలను చంపేసినట్లు చెబుతున్నారు. 2018 నుంచి అతనిపై 18 కేసులు నమోదయ్యాయి. వాటిలో 17 హత్య కేసులు కాగా, ఒక్కటి కస్టడీ నుంచి తప్పించుకున్న కేసు
ఎరుకల శ్రీను కల్లు, మద్యం దుకాణాల వద్దకు వెళ్లి ఒంటరి మహిళలపై గురి పెట్టేవాడు. ఈ నల 16వ తేదీన మహబూబ్ నగర్ లోని ఓ కల్లు దుకాణం వద్దకు వెళ్లి అక్కడ అలివేలమ్మతో మాటలు కలిపాడు. దేవరకద్ర ప్రాంతంలో ఒకరు తనకు రూ. 20 వేలు ఇవ్వాల్సి ఉందని, వాటిని ఇప్పిస్తే రూ. 4 వేలు ఇస్తానని ఆమెకు ఆశ చూపాడు. దాంతో ఆమె శ్రీను బైక్ పై వెళ్లింది.
మధ్యలో వారు మద్యం సేవించారు. మత్తులో ఉన్న అలివేలమ్మ ఛాతీపై బలంగా కొట్టి, తలను నేలకేసి బాది ఆమెను శ్రీను చంపేశాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, చెవి కమ్మలు, కాలి పట్టీలు తీసుకుని పారిపోయాడు. ఈ కేసు విచారణ సందర్బంగా పోలీసులు శ్రీను పాత్రను అనుమానించి, అతన్ని ప్రశ్నించారు.
పోలీసులు అరెస్టు చేసిన రోజు ఏమీ తెలియనట్లు స్రీను మహబూబ్ నగర్ జిల్లా ఉన్నతాధికారులకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. తాను జైలు నుంచి విడుదలైన తర్వాత పూర్తిగా మారిపోయి పనిచేసుకుంటున్నానని చెప్పాడు. అయినా తనను విడిచిపెట్టారా అంటూ అడిగినట్లు తెలుస్తోంది.
మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ రాజేశ్వరి శుక్రవారం కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. హంతకుడికి సహకరించిన శ్రీను భార్య సాలమ్మను కూడా అరెస్టు చేసినట్లు ఆమె తెలిపారు.