యువనేతలను కలవరపెడుతున్న సోషల్ మీడియా లోకేష్ తో మొదలు జగన్, కెటిఆర్ కూ సోషల్ సెగ అభిమానుల పోస్టింగ్స్ తో యువతనేతలకు తలనొప్పి రాజకీయాల్పలో హాట్ టాపిక్ అయిన సోషల్ వార్
వాళ్లు ముగ్గురు యువ నేతలు. భవిష్యత్తు రాజకీయాల్లో చక్రం తిప్పాల్సిన వాళ్లు. వాళ్లను చూస్తే జనాలకు హడల్. ఇక వారి పార్టీల్లో ఆ యువనేతలకు ఎదురే లేదు. వాళ్లు చెప్పిందే వేదం, చేసిందే శాసనం. కానీ వాళ్లు ఏమైతే మాకేంటి? అంటున్నది సోషల్ మీడియా. ఆ ముగ్గురు యువ నేతలను చెడుగుడు ఆడుకుంటున్నది. మరీ విచిత్రమేమంటే ఉపరాష్ట్రపతి వెంకయ్య భుజాలపై తుపాకి పెట్టి మరీ యువనేతలను టార్గెట్ చేయడం చర్చనీయాంశమైంది. సోషల్ మీడియా తీరుతో ఆయా పార్టీల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి.
ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఎ అభ్యర్థిగా వెంకయ్య నాయుడు పేరును ఖరారు చేసింది బిజెపి. దీంతో మొదలైంది రచ్చ. ముందుగా ఆంధ్రజ్యోతి అనే పత్రిక వెబ్ సైట్ లో ఒక వార్త ప్రచురితమైనట్లు ఒక పోస్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

టిడిపి యువనేత లోకేష్ సూచన మేరకే వెంకయ్య నాయుడు పేరు ఉపరాష్ట్రపతి పదవికి పరిశీలించారన్నది ఆ పోస్టు సారాంశం. లోకేష్ మదిలో మెదిలిన ఆలోచన చాలా అద్భుతంగా ఉందని తన తండ్రి ఎపి సిఎం చంద్రబాబు మెచ్చుకుని ఆ విషయాన్ని మోడీకి చేరవేయడంతో వెంకయ్య ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా డిసైడ్ అయిపోయారన్నది అసలు మ్యాటర్. ఇక ఈ విషయంలో టిడిపి అనుబంధ సోషల్ మీడియా రియాక్టు అయింది. వాళ్లు ఇంకో పోస్టు సృష్టించారు.

వెంకయ్య పేరు ఖరారు చేయడంలో జగన్ మదిలో పుట్టిన ఆలోచన అని.. ఆయనకు వైఎస్ కలలో వచ్చి చెప్పాడని అందుకే ఆ విషయాన్ని అమిత్ షా వద్ద ప్రస్తావించగానే బిజెపి వెంకయ్యను డిసైడ్ చేసిందని ఆ పోస్టును రూపొందించి వదిలారు. ఈ పోస్టు సాక్షి వెబ్ సైట్ లో ప్రచురితమైనట్లు క్రియేట్ చేశారు. ఇక వీరిద్దరితో ఆగలేదు ఆ తతంగం. తర్వాత కెటిఆర్ మీద పడ్డారు. నమస్తే తెలంగాణ పత్రిక వెబ్ సైట్ లో ఇదే మ్యాటర్ పూసగుచ్చినట్లు పోస్టు చేశారు. కెటిఆర్ సూచన మేరకు సిఎం కెసిఆర్ ప్రధానితో మాట్లాడి వెంకయ్యను ఖరారు చేయించారన్నది సారాంశం.

మొత్తానికి వీళ్ల సోషల్ మీడియా పోరాటంతో యువనేతలతోపాటు ఉపరాష్ట్రపతి పదవికి పోటీలో ఉన్న వెంకయ్య నాయుడు కు సైతం పెద్ద తలనొప్పి వచ్చి పడింది. ఆయన అసలే అయిష్టతతో ఆ పదవికి పోటీ చేస్తున్నట్లు వార్తలొస్తున్న తరుణంలో ఈ సోషల్ పంచాయితీ ఆయనను ఇబ్బందిపెడుతుందేమోనని కార్యకర్తలు భావిస్తున్నారు.
