మృత్యువు ఒడిలో చేరిన సరస్వతి పుత్రిక.. సహోద్యోగుల వేధింపులే కారణమంటూ ఆడియో..!
ఆమె సరస్వతి పుత్రిక.. అధ్యాపకురాలిగా చేస్తున్న ఆమెను సహచర ఉద్యోగులే మానసికంగా హింసించారు. బలవన్మరణం చెందడానికి కారణమయ్యారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరులో జరిగిన స్థానికంగా విషాదాన్ని నింపింది.
ఆమె సరస్వతి పుత్రిక. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయురాలు. కానీ, విధి నిర్వహణలో ఇబ్బందులెదుర్కొలేక ఓడిపోయింది. ఇబ్బందుల్లో అండగా నిలవాల్సిన సహచర ఉద్యోగులు.. ఏకతాళి చేశారు. ఆమెను సూటిపోటి మాటలతో బాధించారు. పనిగట్టుకొని మరీ ఆమెకు సమస్యలు సృష్టించారు. ఆమెను మానసికంగా హింసించారు. చివరికి అన్ని సమస్యలకు చావే అన్న పరిస్థితిని సృష్టించారు. సహచరుల తీరుతో తీవ్ర ఆవేదనకు గురైన ఆమె చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే… మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలానికి చెందిన తిరుమలేశ్వరి చదువులో దిట్ట. పేదరికంతో బాధపడుతున్న చదువుల్లో రాణించింది. ఉన్నత చదవులు చదివిన తిరుమలేశ్వరి ..ఒక్కటి కాదు.. రెండు కాదు. ఏకంగా ఐదు ఉద్యోగాలు సాధించింది. టీచింగ్ పై ఆసక్తి ఉండటంతో ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నారు. కరీంనగర్ గురుకుల పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఆమె నాలుగేళ్ల క్రితం డిప్యుటేషన్‌పై చెన్నూరు గురుకుల పాఠశాలకు వచ్చారు.
ఆమె భర్త సందీప్ వివరాల ప్రకారం.. గురుకుల పాఠశాలలో జోనల్ స్థాయి ఆటల పోటీలు జరుగుతున్నాయి. అయితే..ఇందులో పాల్గొంటున్న 1275 మంది క్రీడాకారులు, మరో వంద మంది వరకు సహాయ సిబ్బందికి సంబంధించి భోజన ఏర్పాట్లు చేయాలి. ఆ బాధ్యతలను (మెస్ కమిటీ ఇన్‌చార్జి) తిరుమలేశ్వరికి అప్పగించారు. మెస్ కమిటీ లో ఆమెకు సహాయంగా ఉండేందుకు 10 మంది సిబ్బంది ఉంటారు. గత నాలుగు రోజులుగా తిరుమలేశ్వరి ఈ బాధ్యతల్లో బిజీబిజీగా ఉంది. కానీ, ఆమెకు కమిటీ సభ్యుల్లో ఏ ఒక్కరూ సహకరించలేదు.
దీంతో తానొక్కత్తే భోజన ఏర్పాటు చూసుకుంటుంది. సహాచర ఉపాధ్యాయురాలు ఆమెకు సహకరించకపోగా.. ఏర్పాటు సరిగా లేవని సూటీ పోటీ మాటలతో కించపరుస్తున్నారు. ఎగతాళి చేశారు. ఈ క్రమంలో ఆదివారం నాడు.. టిఫిన్, భోజనం ఆలస్యంగా అందడంతో అందరూ తిరుమలేశ్వరినే తప్పుబట్టారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె సమీపంలోని చెరువులో దూకి ఆత్యహత్య చేసుకున్నారు.
జాలర్ల సహాయంతో చెరువులో తిరుమలేశ్వరి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతురాలి సెల్‌ఫోన్‌లో.. తనను ప్రిన్సిపల్ మేడం, ఏసీటీ, పీఈటీలతో పాటు మరోకరు టార్చర్ చేశారని, నా చావుకి కారణం వీళ్లేనని, వాళ్ల కాల్ రికార్డ్ పరిశీలించగలరని అంటూ బాధితురాలు తిరుమలేశ్వరి ఆడియో టేప్ లో పేర్కొంది. తన భార్య ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె భర్త డిమాండ్ చేస్తున్నారు.