అభం శుభం తెలియని ఓ పదేళ్ల చిన్నారిపై విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు కన్నేసాడు. బాలిక ఒంటరిగా వుండగా స్కూల్లోనే అసభ్యంగా ప్రవర్తించి ఉపాధ్యాయ వృత్తికే కలంకం తెచ్చాడు.
హైదరాబాద్: బయట రోడ్డుపైకి వెళితేనే కాదు ఇళ్లు, ఆఫీస్, స్కూల్, కాలేజీ... ఎక్కడా మహిళలకు వేధింపులు తప్పడంలేదు. కొన్నిసార్లు కాపాడాల్సిన వారే చిన్నారులు, మహిళల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో ఓ పదేళ్ళ చిన్నారిపై స్కూల్ టీచర్ అసభ్యంగా ప్రవర్తించాడు. చదువుల తల్లి నిలయమైన పాఠశాలలోనే ఒంటరిగా కనిపించడమే ఆ చిన్నారితల్లి చేసిన పాపం. బాలికతో తరగతి గదిలోనే నీచంగా ప్రవర్తించాడు కీచక ఉపాధ్యాయుడు.
వివరాల్లోకి వెళితే... పాతబస్తీలోని ఫలక్ నుమా భారత్ కోట ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలో అష్వాఖ్ అహ్మద్(35) ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో చాంద్రాయణగుట్టకు చెందిన చిన్నారి(10) నాలుగో తరగతి చదువుతోంది.
అయితే రోజూ మాదిరిగానే శనివారం కూడా బాలికను ఆమె తాత స్కూల్ వద్ద వదిలివెళ్లాడు. స్కూల్ ప్రారంభమవడానికి ఇంకా చాలా సమయం వుండటంతో మిగతా విద్యార్థులెవ్వరూ రాకపోవడంతో తరగతి గదిలో చిన్నారి ఒంటరిగా వుంది. ఇదే సమయంలో స్కూల్ కి వచ్చిన ఉపాధ్యాయుడు అష్వాఖ్ బాలిక ఒంటరిగా వుండటాన్ని గమనించాడు. దీంతో అతడికి పాడుబుద్ది కలిగింది.
బాలిక వద్దకు వెళ్లిన ఈ కీచకుడు మాయమాటలు చెబుతూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించసాగాడు. దీంతో అతడి పాడుబుద్దిని గుర్తించిన చిన్నారి తరగతి గదిలోంచి బయటకు వచ్చి అదే స్కూల్లో చదివే తన సోదరుడికి విషయం తెలిపింది. అతడు తండ్రికి ఫోన్ చేసి చెల్లితో టీచర్ అసభ్యంగా ప్రవర్తించిన విషయాన్ని తెలిపాడు.
వెంటనే స్కూల్ వద్దకు చేరుకున్న బాలిక తల్లిదండ్రులు, బంధువులు టీచర్ అష్వాఖ్ ను నిలదీసారు. అతడు ఏదో చెప్పి తప్పించుకోడానికి ప్రయత్నించినా బాలిక తండ్రి వెనక్కి తగ్గకుండా ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేసాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న బండ్లగూడ మండల ఉప విద్యాధికారి బాలునాయక్ పాఠశాలను సందర్శించారు. బాధిత బాలిక తల్లిదండ్రులతో స్కూల్లోని మిగతా స్టాప్ తో మాట్లాడి వివరాలను సేకరించారు. తప్పుచేసినట్లు తేలితే అష్వాఖ్ పై శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటామని విద్యాధికారి తెలిపారు.
అయితే అష్వాఖ్ కు ఇప్పటికే పెళ్లవగా మనస్పర్ధల కారణంగా భార్య దూరంగా వుంటోంది. దీంతో మెంటల్ గా బాగా డిస్టర్బ్ అయిన అతడు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడని అతడి కుటుంబసభ్యులు తెలిపారు. అందువల్లే బాలికతో అతడలా ప్రవర్తించాడని అనుమానిస్తున్నారు.
ఇదిలావుంటే ఇదే హైదరాబాద్ అభం శుభం తెలియని ఓ మైనర్ బాలికపై ఆర్నెళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతూ తాజాగా పట్టుబడ్డాడో యువకుడు. బాలిక ద్వారా విషయాన్ని తెలుసుకున్న కుటుంబసభ్యులు, స్థానికులు సదరు యువకున్ని పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.
సంగారెడ్డి జిల్లా (sangareddy district) జహీరాబాద్ ప్రాంతానికి చెందిన మహ్మద్ మోహిజ్(20) హైదరాబాద్ లో వెల్డింగ్ పనులు చేస్తుంటాడు. ఎమ్ఎస్ మక్తాలో ఇతడి అక్కాబావ అద్దెకు వుండటంతో వారివద్దే వుండేవాడు. అయితే ఇదే ఇంట్లో మరో కుటుంబం కూడా నివాసముంటోంది. ఇలా పక్క పోర్షన్ లో తల్లిదండ్రులతో కలిసి వుంటున్న 13ఏళ్ల మైనర్ బాలికపై మోహిజ్ కన్ను పడింది. దీంతో బాలికకు మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు.
ఇలా బాలికను లోబర్చుకున్న అతడు గత ఆరు నెలలుగా లైంగిక దాడి (sexual harassment)కి పాల్పడుతున్నాడు. అద్దెకుండే ఇంటి టెర్రస్ పైకి తీసుకెళ్లి బాలికపై అఘాయిత్యానికి పాల్పడేవాడు. ఇలా చాలాకాలంగా వ్యవహారం సాగుతుండగా యువకుడి పాపం పండి తాజాగా ఈ విషయం బయటపడింది. బాలిక ఒంటిపై పంటిగాట్లను గమనించిన కుటుంబసభ్యులు నిలదీయగా తనపై జరుగుతున్న అఘాయిత్యం గురించి బయటపెట్టింది.
