గొంగళిపురుగుల భయంతో ఓ గవర్నమెంట్ స్కూల్ కు సెలవు ప్రకటించిన వింత ఘటన ములుగు జిల్లాలో వెలుగుచూసింది. 

ములుగు : ఆందోళనలు,బంద్ లు జరిగినా, వాతావరణ పరిస్థితులు బాగాలేకున్నా మొదట మూతపడేది పాఠశాలలే. చివరకు గొంగళిపురుగులకు భయపడిపోయి స్కూల్ కు సెలవు ప్రకటించే పరిస్థితి ములుగు జిల్లాలో ఏర్పడింది. స్కూల్లో కుప్పలుకుప్పలుగా గొంగళిపురుగులు ప్రవేశించడంతో విద్యార్థులే కాదు ఉపాధ్యాయులు కూడా భయపడిపోయారు. దీంతో ఏకంగా స్కూల్ కే సెలవు ప్రకటించారు. 

ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ములుగు జిల్లా మర్రిగూడెం గ్రామంపై గొంగళిపురుగుల బెడద ఎక్కువయ్యింది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల పరిసరాల్లో అయితే ఈ గొంగళిపురుగులు మరీ ఎక్కువగా వున్నాయి. నేలపై, గోడలపై పారుతున్న ఈ పురుగులు చూసి విద్యార్థులు, ఉపాధ్యాయులు బెంబేలెత్తిపోతున్నారు. 

గొంగళి పురుగుల వల్ల తమ పిల్లల శరీరంపై దద్దుర్లు ఏర్పడుతున్నాయని మర్రిగూడెం విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము కూడా అదే బాధను అనుభవిస్తున్నామని ఉపాధ్యాయులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో విద్యాశాఖ ఉన్నతాధికారుల సూచన మేరకు పాఠశాలకు సెలవు ప్రకటించారు హెడ్ మాస్టర్.

Read More ఎర్రని రక్తంతో తడిసిన నోటితో...జనావాసాల్లో క్రూరజంతువు హైనా కలకలం

గొంగళి పురుగుల నివారించి తమ పిల్లల చదువులు సజావుగా సాగేలా చూడాలని అధికారులను మర్రిగూడెం ప్రజలు కోరుతున్నారు. దీంతో ఈ పురుగుల బెడద ఎలా వదిలించుకోవాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.