ఎర్రని రక్తంతో తడిసిన నోటితో...జనావాసాల్లో క్రూరజంతువు హైనా కలకలం
అడవిలోంచి క్రూరమైన జంతువు హైనా జనావాసాల్లోకి వచ్చి భయబ్రాంతులకు గురిచేసిన సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
కరీంనగర్ : అర్థరాత్రి ప్రమాదకరమైన అడవిజంతువు హైనా జనావాసాల్లోకి వచ్చి కలకలం సృష్టించింది. కరీంనగర్ జిల్లాలోని ఓ గ్రామంలో వీధికుక్కపై దాడిచేసిన హైనా అక్కడే పీక్కుతింది. ఈ భయానక దృశ్యం గ్రామస్తుల కంటపడింది. మూతినిండా రక్తంతో భయంకరంగా వున్న హైనాను చూసి గ్రామస్తులు భయబ్రాంతులకు గురయ్యారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంపరిధిలోని గ్రామాల్లో హైనా భయం పట్టుకుంది. ఇప్పటికే పశువులు, గొర్రెల మందలపై అడవిజంతువు హైనా దాడులు చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. తాజాగా అర్ధరాత్రి మల్లాపూర్ గ్రామంలో ప్రవేశించిన హైనా వీధికుక్కపై దాడిచేసింది. కుక్క అరుపులు విన్న గ్రామస్తులు కొందరు ఇళ్లనుండి బయటకువచ్చి చూడగా భయానక దృశ్యం వారి కంటపడింది. కుక్కను పీక్కుతింటూ నోటిచుట్టూ రక్తంతో హైనా భయంకరంగా కనిపించింది.
భయపడిపోతూనే గ్రామం నుండి హైనాను తరిమేందుకు గ్రామస్తులు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే కొందరు తమ సెల్ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీసారు. వీటిని సోషల్ మీడియాలో పెట్టడంతో మండలమంతా హైనా సంచారం గురించి ప్రచారమయ్యింది. దీంతో మండలంలోని అన్నిగ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Read More హైదరాబాద్‌లో థియేటర్ కాంప్లెక్స్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన గర్భిణీ సహా 12 మంది..
హనా బారినుండి తమను రక్షించాలని... వెంటనే దాన్ని బంధించాలని తిమ్మాపూర్ మండల ప్రజలు కోరుతున్నారు. మల్లాపూర్ గ్రామస్తులు సమాచారం అందించడంతో హైనాను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు.