సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు తృుటిలో పెను ప్రమాదం తప్పింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో సండ్ర పాల్గొన్నారు.

అనంతరం తిరిగి సత్తుపల్లి వెళుతుండగా... పరేడ్ గ్రౌండ్ సమీపంలోని శివాలయం వద్ద ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయిన ఎమ్మెల్యే డ్రైవర్ పక్కనే ఉన్న కాల్వను గమనించికపోవడంతో కారు టైరు కాల్వలో ఇరుక్కుపోయింది.

వాహనం ఒక పక్కకు ఒరిగి పోతుండగా డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో కారు బోల్తా పడకుండా ఆగిపోయింది. వెంటనే ఎమ్మెల్యే సండ్ర, గన్‌మెన్‌లు కిందకు దిగారు. ప్రమాద విషయాన్ని గమనించిన స్థానికులు అక్కడకు చేరుకుని కారును బయటకు తీశారు.

ఆ సమయంలో గుడికి దగ్గర్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనంతరం సండ్ర అదే కారులో హైదరాబాద్ వెళ్లిపోయారు.