టిఆర్ఎస్ ఎంపి వినోద్ కు కరీంనగర్ నిరుద్యోగి షాక్

First Published 5, Dec 2017, 6:28 PM IST
Saroornagar kotlata effect seen in karimnagar on mp vinod
Highlights
  • లైబ్రరీ బాగానే ఉంది కానీ నోటిఫికేషన్లు ఏవీ
  • ఎంపి వినోద్ ను నిలదీసిన కరీంనగర్ నిరుద్యోగి యోగి
  • నోటిఫికేషన్లు వెలువరిస్తామంటూ అక్కడినుంచి నిష్క్రమణ

నిన్న కొలువులకై కొట్లాట సభ హైదరాబాద్ లో జరిగింది. ఇవాళ ఆ ఎఫెక్ట్ కరీంనగర్ లో కనబడింది. మన ఉద్యోగాల కోసం గట్టిగా కొట్లాడాలి అని జెఎసి పంతులు కోదండరాం పిలుపునిచ్చిండు. దీంతో ఒక నిరుద్యోగి కరీంనగర్ లో టిఆర్ఎస్ ఎంపి వినోద్ కుమార్ ను గట్టిగానే నిలదీసిండు. ఈ ముచ్చట ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో గిరికీలు కొడుతున్నది.

వివరాలు ఇప్పుడు చదవండి. కరీంనగర్ ఎంపి వినోద్ కుమార్ ఇవాళ కరీంనగర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఒక చేదు అనుభవం ఎదురైంది. కరీంనగర్ పట్టణంలోని  లైబ్రరీలో ఫ్రీ వైఫై సేవలను ఎంపీ వినోద్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. నిరుద్యోగ యువతకు చదువుకునేందుకు వీలుగా లైబ్రరీలో అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. లైబ్రరీలో నిరుద్యోగులు కాంపీటీటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేరయ్యేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని  చెబుతున్నారు. అంతలో అక్కడే ఉన్న ఓ యువకుడు లైబ్రరీ బాగానే ఉంది కానీ ఉద్యోగ నోటిఫికేషన్లు ఎక్కడంటూ ఎంపీని నిలదీశారు. కొలువుల క్యాలెండర్ ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. మూడున్నరేళ్లుగా చేయనిది ఇప్పుడెలా ఇస్తారని యోగి అనే యువకుడు ప్రశ్నించాడు. దీంతో అక్కడ ఉన్న టిఆర్ఎస్ నేతలంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

కరీంనగర్ నిరుద్యోగి యోగి నుంచి ఊహించని రీతిలో ఎదురైన ప్రశ్నకు ఎంపీ వినోద్ కూడా తడబడ్డారు. అయితే ప్రభుత్వం అందరికి ఉద్యోగాలు కల్పించలేదని ఉద్యోగాలు ఇవ్వలేమన్నారు. విద్యార్థులు వ్యవసాయం పై కూడా దృష్టి పెట్టాలన్నారు. తెలంగాణ కోసం కొట్లాడి ఇంతకాలం ఎదురు చూసింది ఉద్యోగం కోసమేనని వ్యవసాయం కోసం కాదని యువకుడు వాదనకు దిగిండు. అయితే కొత్త గా ఏర్పడిన రాష్ట్రం కావడంతో విభజన ప్రక్రియకే ఏడాది పట్టిందని యువకుడి మాటలతో తాను ఏకీభవిస్తానని వినోద్ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. తెలంగాణ ప్రస్తుతం పురిటి నొప్పులు అనుభవిస్తోందని త్వరలో పారదర్శకంగా నియమకాలు జరుగుతాయని చెప్పి ఎంపీ అక్కడి నుంచి నిష్క్రమించారు.

loader