సరూర్ నగర్ పరువు హత్య : రంజాన్ కావటంతో హత్య వాయిదా.. వెలుగులోకి షాకింగ్ విషయాలు...
సరూర్ నగర్ పరువు హత్య కేసులో ఇద్దరు అరెస్ట్ అయిన తరువాత సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నాగరాజును ఎప్పుడో చంపాలనుకున్నారు కానీ రంజాన్ పండగ రావడంతో ఆగారట. పండగ తెల్లారి తమ పథకం అమలు చేశారు.
హైదరాబాద్ : Saroor Nagar honour killing కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. చెల్లెలు ఆశ్రిన్ సుల్తానా ఇష్టం లేని పెళ్లి చేసుకుందన్న కోపంతో రగిలిపోయిన సోదరుడు Syed Mobin అహ్మద్… పథకం ప్రకారమే Nagraju murder చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు మే 6న సయ్యద్ మోబిన్ అహ్మద్, మహమ్మద్ మసూర్ అహ్మద్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీస్ రిమాండ్ రిపోర్టులో హత్యకు దారితీసిన పరిస్థితులు, నిందితుల పథక రచన వివరాలను పేర్కొన్నట్లు సమాచారం.
వికారాబాద్ జిల్లా మర్పల్లికి చెందిన నాగరాజు(25), ఆశ్రిన్ సుల్తానా (25) పాఠశాల వయస్సు నుంచి ప్రేమించుకున్నారు.ఈ ఏడాది ఫిబ్రవరి 1న పాతబస్తీలోని ఆర్యసమాజ్ లో వివాహం చేసుకున్నారు. మే 4న రాత్రి 7గంటల సమయంలో సరూర్ నగర్ వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న నాగరాజు దంపతులను అడ్డగించి నాగరాజు హతమార్చారు.
అసలేం జరిగిందంటే…
హత్యకేసులో ప్రధాన నిందితుడు మోబిన్ అహ్మద్ ఇంటికి పెద్ద కుమారుడు. తండ్రి మూత్రపిండాల వ్యాధికి గురవడంతో డయాలసిస్ చేయించేందుకు అనువుగా ఉంటుందని idpl కాలనీ గురుమూర్తి నగర్ చేరారు. రెండేళ్ల క్రితం తండ్రి మరణించడంతో కుటుంబ భారం మోబిన్ అహ్మద్ పై పడింది. తల్లి, ముగ్గురు చెల్లెలు, తమ్ముని పోషించేందుకు పండ్లు విక్రయించేవాడు. నిరుడు రెండో సోదరిని లింగంపల్లికి చెందిన మసూద్ అహ్మద్ కు ఇచ్చి వివాహం చేశాడు. మూడో చెల్లెలు ఆశ్రిన్ సుల్తానాకు పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు.
ఈ ఏడాది జనవరిలో భార్య మరణించి, ఇద్దరు పిల్లలు ఉన్న వ్యక్తితో ఆమెకుపెళ్లి జరిపించేందుకు సిద్ధమయ్యాడు. సోదరి ఎదురు తిరగడం, కొట్టినా దారికి రాకపోవడంతో గొడవలు పెరిగాయి. అక్కడే ఉంటే పెళ్లి చేస్తారు అని భయపడిన ఆశ్రిన్ సుల్తానా జనవరి 30న ఇల్లు వదిలి నాగరాజు వద్దకు చేరింది. ఫిబ్రవరి 1న ఇద్దరూ ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లారు. బాల నగర్ పోలీస్ స్టేషన్ లో ఇరు కుటుంబాలను పిలిపించిన పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తరువాత నాగరాజు, ఆశ్రిన్ వికారాబాద్ జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. రక్షణ కల్పించాలని కోరారు. రెండుసార్లు నాగరాజు మోబిన్ అహ్మద్ తో మాట్లాడాడు. మతం మారేందుకు తాను సిద్ధమేనంటూ చెప్పాడు.
అక్క చెప్పిన ఆశ్రిన్ ఆచూకీ..
పెళ్లి తర్వాత ఆశ్రిన్ సుల్తానా లింగంపల్లిలో ఉన్న అక్క, పిన్నితో ఫోన్ లో మాట్లాడేది. అక్క భర్త ద్వారా మోబిన్ అహ్మద్ కు దంపతుల ఆచూకీ తెలిసింది. నాగరాజు, ఆశ్రిన్ ఫోన్ నెంబర్లను సేకరించిన మోబిన్ అహ్మద్ స్నేహితుల సహకారంతో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నాగరాజు మొబైల్లో మాల్వేర్ ఇన్స్టాల్ చేయించాడు. లొకేట్ యాప్ ద్వారా ఏ సమయంలో ఎక్కడున్నారు అనే సమాచారం సేకరిస్తూ వచ్చాడు. మార్చిలోనే హత్యకు పథకం వేసినా రంజాన్ ఉపవాస దీక్షలో ఉండటంతో వాయిదా వేశాడు. రంజాన్ మరుసటి రోజు బుధవారం నాడు ఘాతుకానికి తెగబడ్డాడు.