నిజామాబాద్‌: నర్సింగ్ విద్యార్థినులను లైంగిక వేధించిన కేసులో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ తనయుడు ధర్మపురి సంజయ్ ఎట్టకేలకు పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు.విద్యార్థినుల ఫిర్యాదుతో ధర్మపురి సంజయ్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. 

సంజయ్‌ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ శాంకరీ నర్సింగ్‌ కళాశాల విద్యార్థినులు ఆరోపించారు. ఈ కేసులో 41- సీఆర్‌పీసీ ప్రకారం పోలీసులు సంజయ్‌కు నోటీసులు జారీచేశారు. ఈ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు నిజామాబాద్‌ పోలీసులు ఈ నోటీసులు ఇచ్చారు. అజ్ఞాతంలోకి వెళ్లిన సంజయ్‌ చివరకు ఆదివారం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.

సంజయ్‌ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ 11 మంది నర్సింగ్‌ విద్యార్థినులు గురువారం తెలంగాణ హోం శాఖా మంత్రి నాయిని నర్సింహారెడ్డికి కూడా ఫిర్యాదు చేశారు. నాయని సూచన మేరకు విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో సంజయ్‌పై నిర్భయ యాక్ట్‌ కింద కేసును పోలీసులు నమోదు చేశారు. సంజయ్‌ను ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. తాను ఎవరినీ వేధించలేదని సంజయ్ చెప్పారు.