తన నియోజకవర్గం సంగారెడ్డిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తాను ఉద్యమిస్తుంటే ప్రభుత్వం మాత్రం తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. అందువల్లే తనను అక్రమంగా అరెస్టులు చేయించడం జరుగోతోందని ఆరోపించారు. తనను వ్యక్తిగతంగా విమర్శించడం తర్వాత చేద్దురుగానీ ముందు ప్రజల సమస్యలపై దృష్టిసారించాలంటూ ఆయన తెలంగాణ ప్రభుత్వానికి చురకలు అంటించారు. 

సంగారెడ్డి నియోజకర్గం అనేక సమస్యలతో సతమతం అవుతోందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. వాటిని అసలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జిల్లా ప్రధాన  కేంద్రమైన ఈ పట్టణం  పరిస్థితే ఇలా వుంటే మిగతావాటి పరిస్థితేంటని ప్రశ్నించారు. అందువల్ల సంగారెడ్డి సమస్యలపై పోరాటానికి తాను సిద్దమయ్యానని...వచ్చే సోమవారం నుండి బుధవారం స్థానిక ఐబీ లేదా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. 

తాను ప్రజా సమస్యలపై పోరాటం చేస్తోంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. తనపై అక్రమంగా పెట్టిన పాత కేసులను తిరగదోడుతూ ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా చేస్తే తాను ప్రజాపోరాటాన్ని ఆపేస్తానని వారు అనుకుంటున్నట్లున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సమస్యలు పరిష్కారమయ్యే వరకు తన పోరాటం ఆగదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.