తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాస్త మెత్తబడ్డారు. గతంలో కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబాన్ని పరుష పదజాలంతో దూషించిన ఆయన...ఇప్పుడు వాటి జోలికి వెళ్లడం లేదు. నియోజకవర్గ అభివృద్దే  ఇప్పుడు తన ప్రధాన లక్ష్యమని...అందుకు ముఖ్యమంత్రి సహకరిస్తే ఆయన్ని ఘనంగా సత్కరిస్తానంటూ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ముఖ్యంగా తాను ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్నట్లు సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌ సహాయం కోరతానన్నారు. ఆయన తన డిమాండ్ ను నెరవేరిస్తే కేసీఆర్ ను సంగారెడ్డికి ఆహ్వానించి రాష్ట్రంలో ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రికి లభించనంత ఘన స్వాగతాన్ని పలుకుతానని జగ్గారెడ్డి వెల్లడించారు. 

అలాగే సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ది కోసం మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్, ఎంపీ కవితలను కలుస్తానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. వారి ద్వారా నియోజకవర్గానికి లబ్ధి జరిగితే అభివృద్ది పనులకు వారితోనే శంకుస్థాపన చేయిస్తానని ప్రకటించారు. సీఎంతో కానీ అప్పటి జిల్లా మంత్రి హరీష్ రావుతో కానీ తనకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని...రాజకీయ విభేదాలు మాత్రమే వున్నాయని జగ్గారెడ్డి అన్నారు. 

తన అరెస్టు కూడా రాజకీయ లబ్ధి కోసమే జరిగిందని అన్నారు. తమ పార్టీ అభ్యర్ధిని గెలింపించుకోవాలనే కేసీఆర్ తనను అరెస్ట్  చేయించారే తప్ప...వ్యక్తిగత వైరంతో కాదని జగ్గారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో వైరం పెట్టుకోవద్దని జగ్గారెడ్డి సూచించారు.   

మరిన్ని వార్తలు

డబ్బు సంపాదించడానికి వెళ్తున్నా... 6 నెలలు ఉండను: జగ్గారెడ్డి

కేసీఆర్ పై విమర్శలు చేయను: మెట్టు దిగిన జగ్గారెడ్డి

కేసీఆర్‌‌‌పై జగ్గారెడ్డి సాప్ట్ : ఆసక్తికర వ్యాఖ్యలు