కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు  తనపై వస్తున్న వార్తలపై సంగారెడ్డి ఎమ్మెల్యే, మాజీ విఫ్ జగ్గారెడ్డి స్పందించారు. అలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కార్యకర్తలకు సూచించారు. తన ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. అయితే గతంలో మాదిరిగా ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై విమర్శలు చేస్తూ వైరం పెంచుకోకుండా సఖ్యతతో ఉంటానని జగ్గారెడ్డి తెలిపారు. 

సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలోని మల్కాపూర్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ...ఎట్టి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్‌ను, ఆయన కుటుంబాన్ని, ప్రభుత్వాన్ని గానీ విమర్శించనని అన్నారు. అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ కార్యకర్తలతో వైరం పెట్టుకోవద్దని జగ్గారెడ్డి సూచించారు. 

తన వెంటుండే  పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల వ్యక్తిగత అవసరాల కోసం పెద్ద మొత్తంలో డబ్బులు కావాల్సి వుంటుందని జగ్గారెడ్డి అన్నారు. వారి నాయకుడిగా ఆ డబ్బులు సమాకూర్చాల్సిన అవసరం తనపై ఉంటుందని...అందువల్ల డబ్బులు సంపాదించడానికి కాగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వ్యాపారం చేస్తానని అన్నారు. 

వచ్చే ప్రతి ఎన్నికల్లో నియోజవర్గంలో కాంగ్రెస్ జెండానే ఎగరాలని కార్యకర్తలకు సూచించారు. గెలుపు కోసం మీ ఇళ్లు, ఆస్తులు అమ్మినా సరే గెలిచి తీరాలని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టినదానికి రెండితలు ఇచ్చే పూచీ తనదని జగ్గారెడ్డి దైర్యం చెప్పారు.