కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఎమ్మెల్యేగా విజయం సాధించడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చిందని జగ్గారెడ్డి తెలిపారు.

రాబోయే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా పోటీ చేసే అభ్యర్థులు ఆస్తులు అమ్ముకోనైనా, అప్పులు చేసైనా విజయం సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామాల్లో రాజకీయ నాయకులు సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఆర్ధిక వనరులు ఉన్న వ్యక్తులును, అప్పులు చేసే స్థాయి ఉన్న వారిని సర్పంచ్‌ అభ్యర్థులుగా ప్రకటించాలన్నారు.

ఎన్నికల సమయంలో కార్యకర్తలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే బాగా డబ్బులు అవసరమని, వాటిని సమకూర్చుకునేందుకు తాను దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాంట్రాక్టులు చేస్తానన్నారు. ఆరు నెలల వరకు కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండనన్నారు.

సమస్యల పరిష్కారంతో పాటు పార్టీ కార్యక్రమాలకు తనకు బదులుగా తన భార్య, కాంగ్రెస్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు నిర్మలారెడ్డి అందుబాటులో ఉంటారని జగ్గారెడ్డి సూచించారు. అలాగే పార్టీ మారతారన్న వ్యాఖ్యలపైనా ఆయన స్పందించారు.. తాను రాజకీయాల్లో కొనసాగినన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేసి.. గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టారు.