మోత్కుపల్లి అప్పుడే చచ్చిపోయాడు: సండ్ర తీవ్ర వ్యాఖ్యలు

మోత్కుపల్లి అప్పుడే చచ్చిపోయాడు: సండ్ర తీవ్ర వ్యాఖ్యలు

హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రమైన పదజాలం ప్రయోగించిన మోత్కుపల్లి నర్సింహులుపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో టీడీపిని విలీనం చేయాలని అన్నప్పుడే మోత్కుపల్లి చచ్చిపోయాడని ఆయన వ్యాఖ్యానించారు. 

గవర్నర్ పదవి రాకపోవడంతో మోత్కుపల్లి విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపి మహానాడు వేడుక సమయంలో పార్టీపై మోత్కుపల్లి విషం చిమ్ముతున్నారని, రాజకీయ ప్రత్యర్థుల చేతిలో కీలుబొమ్మగా మారారని ఆయన సోమవారం వ్యాఖ్యానించారు 

కేసీఆర్ ది దుర్మార్గమైన పాలన అని మోత్కుపల్లి గతంలో విమర్శించారని, ఇప్పుడు ఆయనకు కేసీఆర్ దేవుడయ్యాడా అని సండ్ర అన్నారు. ప్రజా నాయకుడైతే గత ఎన్నికల్లో మోత్కుపల్లిని ప్రజలు ఎందుకు ఓడించారని ఆయన అడిగారు. 

గవర్నర్‌ పదవి కోసం బీజేపీ నేతల దగ్గరకు తీసుకెళ్లి చంద్రబాబు మాట్లాడించలేదా అని సండ్ర ప్రశ్నించారు. బీజేపీ గవర్నర్ పదవ ఇవ్వకపోతే చంద్రబాబు ఏం చేస్తారని అన్నారు. పవన్‌, జగన్‌ను పొగుడుతున్న మోత్కుపల్లిని ఎవరు ఆడిస్తున్నారో తెలుసునని అన్నారు

మహానాడు సమయంలో కావాలనే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మోత్కుపల్లిని సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదని..మోత్కుపల్లి రాజకీయ జీవితం ముగిసిపోయిందని వ్యాఖ్యానించారు. టీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలన్న మోత్కుపల్లిని మహానాడుకు ఎలా పిలుస్తామని ప్రశ్నించారు.

జిల్లాలో అందరినీ ఇబ్బంది పెట్టిన చరిత్ర మోత్కుపల్లిదని ఆయన అన్నారు. టీడీపిని విమర్శించే నైతిక హక్కు మోత్కుపల్లికి లేదని అన్నారు. మోత్కుపల్లికి నోటు దురుసు ఎక్కువ అని అన్నారు. మోత్కుపల్లికి 1989లో ఎన్టీఆర్ టికెట్ ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Telangana

Next page