తెలుగులో టంకశాల రాసిన ‘వల్లభాయ్‌ పటేల్‌’ పుస్తకానికి సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది.

ప్రముఖ జర్నలిస్టు, రచయిత టంకశాల అశోక్‌ సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. 2016 సంవత్సరానికి అనువాద పుస్తకాలకు సంబంధించి తెలుగులో ఆయన రాసిన ‘వల్లభాయ్‌ పటేల్‌’ పుస్తకానికి సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది.

ప్రొఫెసర్‌ విశ్వనాథ్‌ ప్రసాద్‌ తివారీ అధ్యక్షతన మంగళవారం ఢిల్లీలో సాహిత్య అకాడమీ బోర్డు సెలక్షన్‌ కమిటీ ఆయన పుస్తకాన్ని అవార్డుకు ఎంపికచేసింది.

రాజమోహన గాంధీ ఆంగ్లంలో రచించిన పటేల్‌-ఏ లైఫ్‌ (జీవిత చరిత్ర) పుస్తకాన్ని తెలుగులో ‘వల్లభాయ్‌ పటేల్‌’ పేరుతో టంకశాల అనువదించారు. ఈ పుస్తకాన్ని తెలుగులో ఉత్తమ అనువాదంగా జె.చెన్నయ్య, ప్రొఫెసర్‌ టి.మోహనసింగ్‌, వల్లభనేని అశ్వని కుమార్‌తో కూడిన సెలక్షన కమిటీ ఎంపిక చేసింది.

అవార్డుగ్రహీతలకు రూ.50వేల నగదు, తామ్రపత్రం బహుకరిస్తారు. అవార్డు ప్రదానోత్సవ తేదీలను త్వరలో ప్రకటిస్తామని అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు వెల్లడించారు.

ఏపీ సీఎం అభినందనలు

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్న సీనియర్ పాత్రికేయుడు టంకశాల అశోక్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందనలు తెలిపారు.
సాహిత్య రంగంలో దక్కే ఈ అత్యున్నత పురస్కారానికి టంకశాల అశోక్ అన్నివిధాలా అర్హుడని ప్రశంసించారు.