Sadar Utsav Mela: సదర్ అనేది తెలంగాణలోని వివిధ ప్రాంతాల‌తో పాటు హైదరాబాద్ లో యాదవ సమాజం దీపావళిలో భాగంగా ప్రతి సంవత్సరం జరుపుకునే గేదెల ఉత్సవం. నారాయణగూడలోని వైఎంసీఏలోలో న‌వంబర్ 14, 15 తేదీల‌లో సదర్ ఉత్సవ్ మేళా జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. 

Hyderabad Sadar Utsav Mela: హైద‌రాబాద్ నారాయణగూడలోని వైఎంసీఏలో మంగళవారం రాత్రి 7 గంటల నుంచి బుధవారం తెల్లవారుజామున 3 గంటల వరకు సదర్‌ ఉత్సవ్‌ మేళా జరగనున్న నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. దీనికి సంబంధించి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. దీని ప్రకారం.. కాచిగూడ ఎక్స్ రోడ్స్ నుండి వైఎంసీఏ, నారాయణగూడ వైపు వాహనాలను అనుమతించరు. వీటిని కాచిగూడలోని టూరిస్ట్ హోటల్ వైపు మళ్లిస్తారు. విట్టల్‌వాడి ఎక్స్ రోడ్స్ నుండి వైఎంసీఏ, నారాయణగూడ వైపు ట్రాఫిక్‌ను రాంకోటి ఎక్స్ రోడ్స్ వైపు మళ్లిస్తారు.

అలాగే, రాజ్‌మొహల్లా నుండి ట్రాఫిక్‌ను అనుమతించరు. సాబూ షాప్ పాయింట్ వద్ద రాంకోటి ఎక్స్ రోడ్స్ వైపు మళ్లిస్తారు. రెడ్డి కళాశాల నుండి వాహనాలను బర్కత్‌పురా వైపు మళ్లిస్తారు. పాత బర్కత్‌పురా పోస్టాఫీసు నుంచి వైఎంసీఏ, నారాయణగూడ వైపు ట్రాఫిక్‌ను అనుమతించబోమని, క్రౌన్ కేఫ్ లేదా లింగంపల్లి వైపు మళ్లిస్తామని అధికారులు తెలిపారు. దీంతోపాటు పాత ఎక్సైజ్ ఆఫీస్ లేన్ నుండి వైఎంసీఏ, నారాయణగూడ వైపు వచ్చే ట్రాఫిక్‌ను విట్టల్‌వాడి వైపు మళ్లిస్తారు. బర్కత్‌పురా చమన్ నుండి వైఎంసీఏ, నారాయణగూడ వైపు వచ్చే వాహనాలను బర్కత్‌పురా ఎక్స్ రోడ్స్ వైపు లేదా టూరిస్ట్ హోటల్ వైపు మళ్లిస్తారు.

బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ (నారాయణగూడ ఫ్లైఓవర్ దగ్గర) నుంచి రెడ్డి కాలేజీ వైపు వెళ్లే వాహనాలను నారాయణగూడ ఎక్స్ రోడ్స్ వైపు మళ్లిస్తారు. సంబంధిత ట్రాఫిక్ అడ్వైజ‌రీని ప‌రిగణ‌లోకి తీసుకుని పౌరులు తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరారు.