తెలంగాణ డిఎస్సీ మరింత ఆలస్యం మరింత గడువు కోరిన రాష్ట్ర సర్కారు సుప్రీం సీరియస్ విద్యాశాఖ అధికారి వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశం
తెలంగాణలో ఇప్పట్లో డిఎస్సీ లేదని సర్కారు చర్యలు చూస్తే అర్థమవుతోంది. తాజాగా సుప్రీంకోర్టులో జరిగిన కేసులో సర్కారు తన వైఖరిని కోర్టుకు తెలిపింది. మరో రెండు నెలల పాటు తమకు సమయం కావాలని కోరింది. మళ్లీ మళ్లీ గడువు కోరడం పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసును వచ్చేనెల 28కి వాయిదా వేసింది. దీంతోపాటు వచ్చే నెల 28నాటి వాయిదా కు విద్యాశాఖ కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ నిరుద్యోగులకు కేసిఆర్ సర్కారు మరోసారి చేదు వార్త వినిపించింది. 2017 సంవత్సరంలో డిఎస్సీ వేసేదే లేదని సర్కారు చావు కబురు చల్లగా చెప్పిందని నిరుద్యోగులు అంటున్నారు. మరో రెండు నెలల గడువును సర్కారు అడిగిందంటే అక్టోబరు, నవంబర్ పోతే ఇక డిసెంబరు ఏదోరకంగా టైంపాస్ చేసి జనవరి తర్వాత చూసుకుందామన్న ఆలోచనలో సర్కారు ఉన్నట్లు నిరుద్యోగులు అనుమానిస్తున్నారు.
సుప్రీంకోర్టు ఎంతగా మొట్టికాయలు వేసినా తెలంగాణ సర్కారు డోంట్ కేర్ అంటున్నది. విద్యారంగానికి దేశంలోనే ఎక్కడా లేనట్లు పెద్ద పీట వేస్తున్నామని సర్కారు పెద్దలు చెబుతున్నా... ఉపాధ్యాయ పోస్టుల భర్తీ విషయంలో మాత్రం సర్కారు అయిష్టంగా ఉంది. అందుకే సర్కారు ఏర్పడి మూడేళ్లు గడుస్తున్నా ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని నిరుద్యోగులు చెబుతున్నారు.
ఇక టీచర్ అభ్యర్థులు తమ ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. రకరకాల పద్ధతుల్లో సర్కారుపై వత్తిడి పెంచుతున్నారు. తెలంగాణ నిరుద్యోగ జెఎసి కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి ఉస్మానియా యూనివర్శిటీకి పాదయాత్ర చేపట్టి మెగా డిఎస్సీ కోసం పోరాడుతున్నది. మరోవైపు మరికొందరు టీచర్ అభ్యర్థులు మూకుమ్మడిగా పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టారు. సుప్రీంకోర్టుకు వందల సంఖ్యలో పోస్టు కార్డులు రాసి నిరసన తెలిపారు. ఇంకొందరైతే సోషల్ మీడియాలో సర్కారుకు సెగ తాకేలా జోక్స్ పోస్టు చేస్తూ నిరసన తెలుపుతున్నారు.
తెలంగాణలో అధికారులు పనిచేస్తున్నారా అని సుప్రీంకోర్టు మరోసారి ఘాటుగానే ప్రశ్నించింది. అందుకే వచ్చే వాయిదా నాటికి విద్యాశాఖ కార్యదర్శి డిఎస్సీ నోటిఫికేషన్ తో వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. మరి నిన్నమొన్న ఉపముఖ్యమంత్రి కడియం ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ మరో ఆరు నెలల్లో డిఎస్సీ అని చావు కబురు చెప్పారు. దీంతో నిరుద్యోగుల మరింత ఊసూరుమంటున్నారు. తెలంగాణ సర్కారు టీచర్ పోస్టులను ఈ టర్మ్ మొత్తంలో భర్తీ చేస్తుందన్న నమ్మకం కోల్పోయామని నల్లగొండకు చెందిన ఒక టీచర్ అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు.
