Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగుతోంది. అయితే, అక్కడ చిక్కుకుపోయిన భారత విద్యార్థులను తీసుకురావడానికి భారత్.. ఆపరేషన్ గంగాను ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన 260 మంది తెలంగాణ విద్యార్థులు స్వదేశానికి వివిధ విమానాల ద్వారా చేరుకున్నారు.
Telangana: రష్యా కొనసాగిస్తున్న దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలంగాణకు చెందిన 260 మంది విద్యార్థులు ఇప్పటి వరకు స్వదేశానికి చేరుకున్నారని అధికారులు తెలిపారు. వారిలో 140 మంది విద్యార్థులు ఉక్రెయిన్ పొరుగు దేశాల నుంచి 13 విమానాల ద్వారా గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. బుకారెస్ట్ (రొమేనియా), బుడాపెస్ట్ (హంగేరి), ర్జెస్జో (పోలాండ్), కోసీస్ (స్లోవేకియా) నుండి విమానాలు బయలుదేరాయి. ఫిబ్రవరి 26న భారతీయుల తరలింపు ప్రారంభమైనప్పటి నుండి ఒకే రోజులో స్వదేశానికి తిరిగి వచ్చిన తెలంగాణ పౌరుల గరిష్ట సంఖ్య ఇది. వీరిలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF)కి చెందిన నాలుగు విమానాల ద్వారా ఢిల్లీకి చేరుకున్న 65 మంది విద్యార్థులు ఉన్నారు. తెలంగాణ భవన్‌లో తెలంగాణ విద్యార్థులతో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీ అనిల్ కుమార్ మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వారందరినీ ఢిల్లీ, ముంబయి విమానాశ్రయాల్లో స్వాగతం పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వారి కోసం ఢిల్లీ, ముంబయి నుంచి హైదరాబాద్‌కు విమాన టిక్కెట్లు కూడా బుక్ చేసింది. ఇవానో ఫ్రాన్కివ్స్క్ నేషనల్ మెడికల్ యూనివర్శిటీ విద్యార్థి చైతా గాధే, రాష్ట్ర ప్రభుత్వం అందించిన అన్ని రకాల సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆమె పోలాండ్ నుంచి ఢిల్లీలో అడుగుపెట్టింది. ఉక్రెయిన్ బోర్డర్‌కు వెళ్లేందుకు, పోలాండ్‌లోకి వెళ్లేందుకు చాలా ఇబ్బందులు పడ్డామని విద్యార్థి చెప్పాడు. "మేము గందరగోళానికి గురయ్యాము, ఒత్తిడికి గురయ్యాము మరియు ఇంటికి తిరిగి వచ్చినా మా తల్లిదండ్రులు మా భద్రత గురించి ఆందోళన చెందుతున్నారు" ఆమె చెప్పింది. ఉజ్గోరోడ్ నేషనల్ యూనివర్శిటీకి చెందిన నాడియా అనే విద్యార్థిని, తాను హంగరీకి చేరుకోవడానికి సరిహద్దును దాటినట్లు చెప్పింది. "నేను తెలంగాణ ప్రభుత్వ టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసాను. దీంతో అధికారులు అన్ని రకాల సహాయాన్ని అందించారు" అని ఆమె చెప్పారు. ఉక్రెయిన్ నుంచి తమను సురక్షితంగా తీసుకురావడానికి చర్యలు తీసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు భారత రాయబార కార్యాలయానికి కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను తీసుకురావడానికి ఆపరేషన్ గంగాను చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. దీని కోసం ప్రత్యేక విమానాల్లో భారతీయులను స్వదేశానికి తీసుకువస్తున్నది. భారతీయ పౌరుల రక్షణను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం.. అక్కడ చిక్కుకుపోయిన భారత పౌరులను స్వదేశానికి తీసుకురావడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను సైతం రంగంలోకి దించింది.
