RTI war: తెలంగాణలో బీజేపీ దూకుడుగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వంలోని వివిధ శాఖలు, ముఖ్యమంత్రి జీతాలు, ఖర్చులు తదితర వివరాలు కోరుతూ ఏకంగా 100 ఆర్టీఐ దరఖాస్తులు చేసింది బీజేపీ. ఇప్పుడు ఈ అంశం రాజకీయాలను హీటెక్కిస్తోంది.
TRS vs BJP: తెలంగాణలో ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (బీజేపీ), అధికార పార్టీ టీఆర్ఎస్ ల మధ్య రాజకీయాలు కాకరేపుతున్నాయి. తెలంగాణలో బీజేపీ దూకుడుగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వంలోని వివిధ శాఖలు, ముఖ్యమంత్రి జీతాలు, ఇతర ఖర్చులు తదితర వివరాలు కోరుతూ ఏకంగా 100 ఆర్టీఐ దరఖాస్తులు చేసింది బీజేపీ. ఇప్పుడు ఈ అంశం రాజకీయాలను హీటెక్కిస్తోంది. ఎలాగైనా బీజేపీకి చెక్ పెట్టాలని చూస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు.. తాము తక్కువేమి కాదంటూ బీజేపీపై విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలోనే భారీగా టీఆర్ఎస్ సైతం భారీగా ఆర్టీఐ దరఖాస్తులు చేయడానికి సిద్ధమవుతోంది. ఇటీవల జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రచార యుద్ధం, పబ్లిసిటీ స్టంట్లతో.. బ్యానర్ యుద్ధానికి తెరలేపిన గులాబీ, కాషాయ పార్టీలు ఇప్పుడు ఆర్టీఐ యుద్ధాలకు తెరలేపాయి.
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు జీతభత్యాలు, ఇటీవల వివిధ రాష్ట్రాల పర్యటనలకు చేసిన ఖర్చు తదితర అంశాలపై సమాచారం కోరుతూ తెలంగాణ బీజేపీ 100కు పైగా ఆర్టీఐ దరఖాస్తులను దాఖలు చేసిన చేసింది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ, పర్యటనలు, కేంద్ర ప్రభుత్వ శాఖలపై వివరాలు కోరుతూ ఆర్టీఐ దరఖాస్తులను దాఖలు చేయడం ద్వారా బీజేపీని ఎదుర్కోవాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ప్రధాన మంత్రి కార్యాలయం, కేంద్ర ఆర్థిక, హోం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు, ఇతర కీలక శాఖల నుంచి సమాచారం కోరనున్నట్లు టీఆర్ఎస్ నేతలు తెలిపారు. పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభలో ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధాన్ని ఆపింది మోడీయేనని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. దేశాలను పోరాడకుండా మోడీ ఎలా అడ్డుకున్నారో మేము అన్వేషిస్తాము. ఆర్టీఐ కింద వివిధ అంశాలపై సమాచారం కోరతాం అని తెలంగాణ లెజిస్లేటివ్ పీఎస్యూ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఏ. జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
ప్రధాని ఇతర దేశాల పర్యటనలు, ఖర్చులు, ప్రధాని దుస్తులపై ఖర్చు చేసిన మొత్తం, ఇతర వివరాలను కూడా టీఆర్ఎస్ అడగనుంది. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను కలిసేందుకు మోడీ లాహోర్ కు ఎందుకు వెళ్లారో కూడా తెలుసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. "2014 జూన్ 2 నుంచి తాము ఇచ్చిన హామీలపై బీజేపీ వివరాలు కోరుతోంది. మేము ప్రజల కోసం ఎక్కువ చేశాము. మా వాగ్దానాలను నిలబెట్టుకున్నాము కాబట్టి మా ప్రభుత్వం అన్ని వివరాలను అందిస్తుంది. ఏపీ పునర్విభజన చట్టం-2014లో ఇచ్చిన హామీల స్థితిగతులపై సమాచారం కోరతాం. అదేవిధంగా జీఎస్టీ బకాయిలు, పసుపు బోర్డు స్థితి, గత ఎనిమిదేళ్లలో కేంద్రం తీసుకున్న అప్పులు, ప్రతి జన్ ధన్ ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని ఇచ్చిన హామీకి ఏమైంది. పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభ నిర్వహించడానికి బీజేపీకి ఎలా అనుమతి ఇచ్చారో సమాచారం కోరతాము" అని జీవన్ రెడ్డి చెప్పారు.
చార్మినార్ లోని భాగ్యలక్ష్మి ఆలయాన్ని పలువురు బీజేపీ నేతలు సందర్శిస్తున్నారని ఆయన చెప్పారు. ఆర్టీఐ కింద ఆలయ అభివృద్ధికి కేంద్రం, ఇతర రాష్ట్రాల్లోని ఇతర బీజేపీ పాలిత ప్రభుత్వాలు ఎంత మేరకు కృషి చేస్తున్నాయో తమ పార్టీ తెలుసుకోవాలని కోరుకుంటోందని ఆయన అన్నారు. ఎవరైనా ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని కోరవచ్చని, ఇది దరఖాస్తుదారుడికి అందుతుందని ఆయన అన్నారు.
