Asianet News TeluguAsianet News Telugu

బ్రేకింగ్ న్యూస్ : 11 నుంచి తెలంగాణ ఆర్టీసి లో సమ్మె

సమ్మె సైరన్ ఊదిన ఆర్టీసి కార్మికులు

RTC workers will go on strike from June 11

తెలంగాణ ఆర్టీసి కార్మికులు కేసిఆర్ సర్కారుపై కన్నెర్రజేశారు. ముందుగా ప్రకటించినట్లుగానే ఈనెల 11 నుంచి సమ్మెబాట పట్టనున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి.

తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఆర్టీసి కార్మికులు ఆందోళన బాట పట్టారు. అయితే సమ్మె చేస్తే అటునుంచి అటే ఇంటికి పోతారంటూ తెలంగాణ సిఎం కేసిఆర్ కన్నెర్రజేశారు. దేశంలోనే ఎక్కడా లేనంతగా ఆర్టీసి కార్మికులకు వేతనాలు ఇచ్చామని, అయినా సమ్మె చేస్తామని భీష్మించి కూర్చుంటే తామేమీ చేయలేమన్నారు కేసిఆర్. దేశంలో చాలాచోట్ల ఆర్టీసి సంస్థలు మూతపడ్డాయన్నారు. తెలంగాణలో అప్పుల్లో ఉన్న సంస్థను బాగుచేసేందుకే వేతనాలు పెంచామన్నారు. చేయూతనిచ్చినా ఆర్టీసి కార్మికులు సంస్థను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో కాకుండా రాజకీయపరమైన కోణంలో సమ్మె చేయాలనుకోవడం కరెక్ట్ కాదన్నారు.

అయితే కార్మికులు మాత్రం సర్కారుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రభుత్వ వాదనను కార్మికులు, కార్మిక నేతలు తప్పుపడుతున్నారు. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆర్టీసి కార్మికులు ఆధారపడిలేరని తేల్చి చెబుతున్నారు. ఇక్కడ మరో విషయమేమంటే టిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘంగా ఇప్పటి వరకు కొనసాగిన తెలంగాణ మజ్దూర్ యూనియన్ టిఎంయు సైతం సమ్మె సైరన్ మోగించింది. యూనియన్ ప్రధాన కార్యదర్శి అశ్వథ్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మంత్రివర్గ ఉపసంఘం మీద తమకు ఏమాత్రం ఆశలు లేవన్నారు. మే 7వ తేదీన సమ్మెనోటీసు ఇచ్చినప్పటికీ నెలరోజులు గడుస్తున్నా దేశంలో ఎక్కడా లేని రీతిలో కనీసం చర్చలకు కూడా ఆర్టీసి యాజమాన్యం పిలవకపోవడం దురదృష్టకరమన్నారు. అక్రమ రవాణా అరికట్టడం, ఆర్టీసి సంస్థను కాపాడాలన్న ఉద్దేశంతోనే తాము సమ్మె బాట పట్టినట్లు చెప్పారు.

ఈనెల 7వ తేదీన అన్ని డిపోల ముందు కార్మికులు ఎర్ర బ్యాడ్జీలతో నిరసన తెలపాలని నిర్ణయించినట్లు ఇ.ఎ.రెడ్డి తెలిపారు. 8వ తేదీన రీజనల్ కార్యాలయాల ముందు సామూహిక నిరహారదీక్ష చేపట్టాలని నిర్ణయించామన్నారు. అప్పటికీ దిగిరాకపోతే 11 వతేదీన సమ్మెబాట పట్టనున్నట్లు చెప్పారు. ఈ విషయమై టిఎంయు రాష్ట్ర కార్యవర్గ సమావేశం హైదరాబాద్ లో జరిగింది. ఈ సమావేశంలో సమ్మ నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు థామస్ రెడ్డి, నాయకులు బివి రెడ్డి, ఎల్ మారయ్య, జిఎల్ గౌడ్, బాల్ రెడ్డి, ఉషా కిరణ్, శంకర్, కే రాజలింగం, సిఆర్ రెడ్డి, విఎస్ రెడ్డి, వి.కె.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios