Asianet News TeluguAsianet News Telugu

వాళ్లేం చేసుకుంటే మాకేం: జగన్ ఆర్టీసీ విలీనం నిర్ణయంపై కేసీఆర్

ఎపిఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని వైఎస్ జగన్ నిర్ణయంపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిస్పందించారు. వాళ్లేం చేసుకుంటే తమకేమిటని ఆయన అడిగారు. తాము ఇస్తున్న స్కీమ్ లు వాళ్లు ఇస్తున్నారా అని ప్రశ్నించారు.

RTC strike: KCR reacts on APSRTC merger decission of YS Jagan
Author
Hyderabad, First Published Nov 2, 2019, 11:16 PM IST

హైదరాబాద్: వాళ్లేం చేసుకుంటే మాకేమిటని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు వైఎస్ జగన్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే నిర్ణయంపై వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఎపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే నిర్ణయం తీసుకోవడంపై ఓ జర్నలిస్టు ప్రస్తావించగా ఆయన ఆ విధంగా స్పందించారు. 

మంత్రివర్గ సమావేశానంతరం కేసీఆర్ శనివారం రాత్రి ఆర్టీసీ వ్యవహారంపై సుదీర్ఘంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో హామీ ఇచ్చాం కాబట్టి ఆర్టీసీని విలీనం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిందని ఆయన అన్నారు. తెలంగాణలో పెట్టిన పథకాలు ఏపీలో ఉన్నాయా అని అడిగారు. రైతుబంధు పథకం కింద తమ ప్రభుత్వం ఇస్తున్న సొమ్మును, ఏపీ ఇస్తున్న సొమ్మును బేరీజు వేసి ఆయన చెప్పారు. ఏపీ రైతు భరోసా కింద ఇస్తున్న డబ్బులు తాము ఇస్తున్న డబ్బుల కన్నా ఎంత తక్కువ ఉందో చెప్పారు. తాము 5 లక్షల రూపాయల రైతు భీమా ఇస్తున్నామని, వాళ్లు ఇస్తున్నారా అని అన్నారు. తెలంగాణలో ఉండి ఆంధ్రప్రదేశ్ లో లేని పథకాలను కూడా ఆయన చెప్పారు.

Also Read: కేసీఆర్: ఏమైతది.. ఆర్టీసీ ఉండదు, కోదండరామ్, రేవంత్ రెడ్డిలకు రిప్లై.

14 రూపాయలు కూడా ఇచ్చేది లేదు...
 
గ్రేటర్ హైదరాబాదు నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఆర్టీసీకి 14 రూపాయలు కూడా ఇచ్చేది లేదని కేసీఆర్ చెప్పారు. మంచి ఉద్దేశంతో ఓ చట్టం తెచ్చామని, జిహెచ్ఎంసి ఆర్టీసీకి తప్పకుండా నిధులు ఇవ్వాలని చట్టంలో లేదని, సానుభూతిగా జిహెచ్ఎంసి ఆర్టీసీకి నిధులు ఇవ్వాలని చట్టంలో పొందు పరిచామని ఆయన అన్నారు. 

ఓ ఏడాది జిహెచ్ఎంసి 330 కోట్ల రూపాయలు ఇచ్చిందని,  480 కోట్లు ఇవ్వాలని ఆర్టీసీ అడిగిందని, చట్టం చదువుకోకుండా అలుసుగా తీసుకుని నిధులు అడిగిందని కేసీఆర్ అన్నారు. విరగబడితే ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. తాము రోడ్లు వేసుకోవాలా, ఆర్టీసీకి డబ్బులు ఇవ్వాలా అని చెప్పి జిహెచ్ఎంసి వెనక్కి వెళ్లిందని, ఆ మేరకు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపిందని ఆయన చెప్పారు. దాన్ని మంచి ఉద్దేశంతో వాడుకుంటే బాగుండేదని ఆయన అన్నారు. 

Also Read: 5వ తేదీ అర్ధరాత్రి వరకే డెడ్‌లైన్: ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ ఫైనల్ ఛాన్స్.

కేంద్రాన్ని అడుగుతాం...

ఆర్టీసీలో కేంద్రానికి 31 శాతం వాటా ఉన్న మాట వాస్తవమేనని కేసీఆర్ చెప్పారు. 31 శాతం నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని అడుగుతామని ఆయన చెప్పారు. ఈ విషయంపై కేంద్రానికి కూడా సమాచారం ఇస్తామని ఆయన చెప్పారు. కేంద్రం నిధులు ఇవ్వలేదని ఆయన అన్నారు. నష్టాలను భర్తీ చేయాలని కేంద్రాన్ని అడుగుతామని అన్నారు. ప్రభుత్వంపై కామెంట్ చేయడానికి కోర్టుకు అధికారం లేదని ఆయన అన్నారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీ లాభాల్లో ఉందని, ఇప్పుడు నష్టాల్లోకి వెళ్తోందని అనడం మీ వైఫల్యం కాదా అని ఓ జర్నలిస్టు అంటే వైఫల్యమని అనుకోవడం లేదని, సక్సెస్ అనుకుంటున్నానని ఆయన అన్నారు. ఆర్టీసీకి, ప్రైవేట్ కు మధ్య పోటీ ఉండాలని ఆయన అన్నారు. లాభాలు వచ్చే రూట్లను ప్రైవేట్ కు ఇస్తారని అంటున్నారని, కానీ లాభాలు వచ్చే రూట్లే ఆర్టీసీకి ఉంటాయని ఆయన అన్నారు. 

Also Read: ఆర్టీసీ విలీనం లేదు.. 5,100 ప్రైవేట్ బస్సులకు అనుమతి: సీఎం కేసీఆర్

సోయి ఉండి మాట్లాడుతున్నావా....

ఎవరితో మాట్లాడుతున్నావో సోయి ఉండి మాట్లాడాలని కేసీఆర్ ఓ జర్నలిస్టును హెచ్చరించారు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా, ముఖ్యమంత్రిని అలా అడగవచ్చునా అని ఆయన అన్నారు. ఎల్లయ్య ఏదో అంటే నువ్వు అడుగుతావా అని ప్రశ్నించారు. హుజూర్ నగర్ లో ప్రజలు ఏం చేశారో చూశారు కదా అని ఆయన అన్నారు. 

ప్రైవేట్ బస్సులకు రూట్ల పర్మిట్ ఇచ్చే విషయం రవాణా శాఖ మంత్రి, ఆ శాఖ అదికారులు చూసుకుంటారని ఆయన అన్నారు. ఏం జరుగుతుందో 7వ తేదీ తర్వాత మాట్లాడుకుందామని ఆయన అన్నారు. 7వ తేదీ నుంచి అన్నీ ప్రారంభమవుతాయని ఆయన అన్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామని, వేరే ఆలోచనే లేదని ఆయన అన్నారు. కోట్లాది మంది తన మీడియా సమావేశాన్ని చూస్తున్నారని, వారి సాక్షిగానే ఓపెన్ గానే తాను ఆ విషయం చెబుతున్నానని కేసీఆర్ అన్నారు. 

ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరకపోతే ఆర్టీసీ రహిత రాష్ట్రం అవుతుందని, మధ్యప్రదేశ్ కాలేదా అని ఆయన అన్నారు. ప్రజలకు రవాణా సౌకర్యం కావాలి, అది జరుగుతుందని ఆయన అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios