హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె విషయంలో వెనక్కి తగ్గడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు సిద్ధంగా లేరు. శనివారం పదిన్నర గంటలకల్లా కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ కేసీఆర్ ముందుకు రావడానికి సిద్ఘంగా లేరు. హైకోర్టు ఆదేశాలు ఇవ్వలేదని, కేవలం సూచనలు మాత్రమే చేసిందని చెప్పి కార్మిక సంఘాలతో చర్చలు జరపాల్సిన అవసరం లేదని ఆయన ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు తెలుస్తోంది.

ఆర్టీసీ సమ్మెపై 8 గంటలకు సమీక్ష ఉంటుందని రావాలని కేసీఆర్ అధికారులు సమాచారం ఇచ్చారు. దాంతో అధికారులంతా ప్రగతి భవన్ చేరుకున్నారు. అయితే, సమీక్ష అవసరం లేదని ఆయన చెప్పారు. దాంతో రాత్రి 9 గంటలకు ఆర్టీసీ ఉన్నతాధికారులు వెనక్కి వెళ్లిపోయారు. ఆర్టీసీ సమ్మె విషయంలో ఏదైనా చేయడానికి ఇంకా పది రోజుల గడువు దొరికిందని కేసీఆర్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: RTC Strike: "కేసీఆర్ ఎంగిలి సిగరెట్లు ఏరిపారేసే వ్యక్తి అతను"

ఉన్నతాధికారులు ప్రగతి భవన్ కు వచ్చి సిఎంవో సహాయ కార్యదర్శి రాజశేఖర రెడ్డితో సమావేశమయ్యారు. ఆ సమయంలోనే కేసీఆర్ తాజ్ కృష్ణా హోటల్ లోజ జరిగిన మెదక్ ఎస్పీ చందనా దీప్తి రిసెప్షన్ కార్యక్రమానికి వెళ్లి తిరిగి 9 గంటలకు తిరిగి వచ్చారు. నేరుగా కేసీఆర్ ఇంట్లోకి వెళ్లిపోయారు. అధికారులతో కేసీఆర్ ఏమీ మాట్లాడలేదని సమాచారం. 

సమీక్షా సమావేశం అవసరం లేదని, అధికారులను పంపించి వేయాలని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. చర్చలు జరపాలని కోర్టు గట్టిగా ఏమీ చెప్పలేదని, అందువల్ల పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నట్లు సమాచారం. హైకోర్టు విచారణను పది రోజులకు అంటే ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. దీంతో కేసీఆర్ 28వ తేదీ వాదనల తర్వాత ఏమైనా చేయవచ్చునా, లేదా అనేది ఆలోచించుకోవచ్చునని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

Also Read: నేడు తెలంగాణ బంద్..క్యాబ్ లు కూడా కష్టమే

కాగా, శనివారం తెలంగాణ బంద్ కొవనసాగుతోంది. బస్ భవన్ ముట్టడించడానికి వచ్చిన టీజెఎస్ అధ్యక్షుడు కోదండరామ్ ను, టీడీపీ నేతలు రావుల చంద్రశేఖర రెడ్డిని, ఎల్ రమణను, తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళన చేస్తున్న కార్మికులను, కార్మిక నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులతో ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలు జరపాలని కోదండ రామ్ కోరారు.