హైదరాబాద్: షరతులు లేకుండా ప్రభుత్వం తమను విధుల్లోకి  తీసుకోవాలని ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి చేసిన ప్రకటనపై ఏం చేద్దామనే విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం నాడు  సాయంత్రం  అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

ఆర్టీసీ జేఎసీ నేతలు 48 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టు రెండు రోజుల క్రితం ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఆర్టీసీ జేఎసీ నేతలు కూడ  సమ్మె విరమణపై సానుకూలంగా స్పందించారు.

ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎలాంటి షరతులు పెట్టకుండా విధుల్లో చేరాలని కోరితే తాము సమమె విరమించేందుకు సిద్దంగా ఉన్నామని కూడ ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి ప్రకటించారు.

అయితే  ఆర్టీసీ జేఎసీ కన్వీనర్  ఆశ్వత్థామరెడ్డి ప్రకటన నేపథ్యంలో  సీఎం కేసీఆర్ ఆర్టీసీ అధికారులతో గురువారం నాడు సాయంత్రం కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఆర్టీసీ జేఎసీ నేతల ప్రకటనపై ఆర్టీసీ ఉన్నతాధికారులు కూడ గురువారం నాడు సమావేశమయ్యారు.

Also read:ఆర్టీసీ సమ్మెకు బ్రేకులు:నిర్ణయం కేసీఆర్ చేతుల్లోనే....

ఆర్టీసీ జేఎసీ నేతలు షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరిన మీద తాము ఏం చేయవచ్చనే విషయమై ఆర్టీసీ ఉన్నతాధికారులు కూడ గురువారం నాడు చర్చించారు. 

మరోవైపు సీఎం కేసీఆర్ నిర్వహించే సమీక్ష సమావేశంలో ఈ విషయమై  ఆర్టీసీ అధికారులు ఈ సమావేశం వివరాలను చెప్పనున్నారు. రెండు దఫాలు సీఎం కేసీఆర్ విధుల్లో చేరాలని ఆర్టీసీ కార్మికులను కోరారు. కానీ, ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించబోమని ప్రకటించారు.

రెండో దఫా సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు కేవలం 400 మంది మాత్రమే విధుల్లో చేరారు. విధుల్లో చేరిన వారిలో ఎక్కువ మంది  సస్పెన్షన్‌కు గురైన వారే ఉన్నారని ఆర్టీసీ జేఎసీ నేతలు గతంలోనే ప్రకటించారు.

తమ ప్రకటనపై ఆర్టీసీ  జేఎసీ ఏ రకంగా స్పందిస్తోందోననే ఆర్టీసీ జేఎసీ నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ప్రభుత్వ వైఖరిని బట్టి తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించాలని ఆర్టీసీ జేఎసీ నేతలు  అభిప్రాయంతో ఉన్నారు.

Also read:కేసీఆర్ కు పవన్ కళ్యాణ్ మరో రిక్వస్ట్: సానుభూతి చూపించండి

ప్రభుత్వ ప్రకటన వచ్చే వరకు ఆర్టీసీ జేఎసీ నేతలు ఎవరూ కూడ మీడియాతో మాట్లాడడానికి కూడ ముందుకు రావడం లేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం నాడు సాయంత్రం నిర్వహించే  సమావేశంలో ఆర్టీసీపై సీఎం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందనే అభిప్రాయం ఉంది.

గతంలో సమ్మెలు నిర్వహించిన సమయంలో కార్మికులను ఏ రకంగా విధుల్లోకి తీసుకొన్నారనే విషయమై కూడ ఆర్టీసీ ఇంచార్జీ ఎండీ సునీల్ శర్మ ఈడీలతో చర్చించారు. సమ్మె విరమించి విధుల్లో చేరుతామని ఆర్టీసీ జేఎసీ నేతలు ప్రకటిస్తే ఏం చేయాలనే దానిపై కూడ ఆర్టీసీ ఉన్నతాధికారులు చర్చించినట్టుగా సమాచారం. అయితే ఈ విషయాలన్నింటిని కూడ సీఎం కేసీఆర్ ముందు ఉంచనున్నారు.ఈ విషయమై కేసీఆర్ తీసుకొనే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.