హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరోసారి రిక్వస్ట్ చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరాలని నిర్ణయించుకున్న తరుణంలో వారిని చేర్చుకోవాలంటూ కోరారు. 

విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్న ఆర్టీసీ కార్మికుల్ని సానుభూతితో తిరిగి చేర్చుకోవాలని పవన్ కోరారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంతోపాటు మరికొన్ని డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. 

అయితే బుధవారం ఎలాంటి ఆంక్షలు లేకుండా కార్మికులను విధుల్లోకి ఆహ్వానిస్తే సమ్మె విరమింపజేస్తామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కేసీఆర్ కు రిక్వస్ట్ చేశారు. 

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని కార్మిక సంఘాల నేతలు ప్రకటించినందున వారి వినతిని మన్నించాలని కోరారు. కార్మికులపై సానుభూతితో ఎలాంటి ఆంక్షలు లేకుండా విధుల్లోకి చేర్చుకోవాలని కేసీఆర్ కు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. 

ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా తమ ప్రతినిధుల ద్వారా కార్మిక సంఘాల నాయకులు తమను కోరినట్లు తెలిపారు. 40 రోజులకు పైగా సమ్మెలో ఉన్న కార్మికులు తిరిగి విధులకు హాజరయ్యే క్రమంలో వారికి కుటుంబ పెద్దగా సీఎం కేసీఆర్ తగిన భరోసా ఇస్తారని ఆశిస్తున్నట్లు పవన్ స్పష్టం చేశారు. 

దీని ద్వారా ప్రజా రవాణా వ్యతస్థపూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని ఆపై సానుకూలంగా వారి సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించాల్సింది గా కోరుతున్నట్లు జనసేనాని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా కోరారు. 

ఇకపోతే గతంలో కూడా ఆర్టీసీ జేఏసీ నాయకులు పవన్ కళ్యాణ్ ను కలిశారు. తమ ఆందోళనకు మద్దతు పలకాలని కోరారు. తెలంగాణ బంద్ కు సహకరించాలని కోరారు. తమ సమస్య పరిస్కారానికి అవసరమైతే ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడాలని సూచించారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ తో కలిసి చర్చించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇఛ్చారు. అందులో భాగంగా కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించారు. అయితే అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో పవన్ కేసీఆర్ కు ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.